#


Back

   తీర్థయాత్రల దగ్గరి నుంచీ - మన ఆచార వ్యవహారాల దగ్గరి నుంచీ మంత్ర తంత్రాలు- పూజా పురస్కారాల దగ్గర నుంచీ అన్ని వ్యాసంగాలకూ ఒక నమస్కారం చేసి ఊరక కూచోవచ్చు. ఏదీ పాటించకపోయినా మనకేలాటి నష్టమూ లేదు. కొంప మునిగిపోతుందనే భయం లేదు. లేకపోతే ఆ క్షేత్రానికీ ఈ తీర్థానికీ - పరుగెత్తలేక కనిపించిన రాళ్ళకూ రప్పలకూ సాష్టాంగపడలేక తెలిసీ తెలియని మంత్రాలన్నీ జపించలేక అర్థంలేని నియమనిష్ఠలెన్నో అనుష్ఠించలేక దుర్లభమైన ఈ మానవ జీవితమంతా వీటితోనే వెళ్ళబుచ్చే వాళ్ళం. ఇక ఏదీ లేకపోయినా అవే మనలనుద్దరిస్తాయనీ నేరుగా మోక్ష సామ్రాజ్యానికే మనలను చేరుస్తాయనీ గాఢంగా మూఢంగా నమ్మేవాళ్ళం. ఇలాంటి మూఢమైన నమ్మకాల నెన్నింటినో పారదోలి మనకు కనువిప్పు కలిగించారు భగవత్పాదులు. మోక్షసాధనకు బాహ్యమైన పరికరాలుగాని ప్రయత్నంగాని ఏ ఒక్కటీ అక్కరలేదని చెప్పి ఎంతో బరువు తగ్గించారు మనకు.

   అంతా బాగానే ఉంది. అయితే మరి బ్రహ్మతత్త్వాన్ని అందుకోటానికేదో ఒక సాధనమనేది ఉండాలి గదా అది ఏమిటని మరలా ప్రశ్న వస్తుంది. సాధనమనేది ఇక్కడ కర్మగాదు-ఉపాసనాగాదు. ఒక్క జ్ఞానం తప్ప మరేదీ లేదని సిద్ధాంతీకరించారు భగవత్పాదులు. దానికి వారు చెప్పే సబబేమంటే జ్ఞానమనేది వస్తుతంత్రం. మిగతా కర్మోపాసనాదులలాగా పురుషతంత్రం కాదది. పురుషబుద్ధిని బట్టి నడిచేది పురుషతంత్రం. అది వాడి స్వబుద్ధే కావచ్చు. శాస్త్రచోదితమే కావచ్చు. మొత్తం మీద వాడి సంకల్పాన్ని బట్టే అది నడుస్తుంది. ఒకపని చేయాలనుకొంటే చేస్తాడు. లేదా మానాలనుకొంటే మానుతాడు. ఒకచోటికి పోవాలనుకొంటే బండి మీద పోవచ్చు. నడచి పోవచ్చు. అసలు పోకనే పోవచ్చు. వికల్పాని Option కవకాశ ముందక్కడ. ఇలాంటి వికల్పమొక్క లౌకిక కర్మలలోనే గాదు. శాస్త్రచోదితమైన కర్మలలో కూడా ఉందని చెప్పాము. "అతి రాత్రే షోడశినమ్ గృష్ణతి. నాతి రాత్రే షోడశినమ్ గృష్ణతి.” అతిరాత్రమని ఒక యాగమున్నది. అందులో పదహారంచులు గల పాత్ర నుపయోగించాలని ఒక నియమం ఈ నియమాన్ని యజమానుడు పాటిస్తే పాటించవచ్చు. పాటించకపోయినా పోవచ్చు నంటున్నది పయివాక్యం. ఇలా ఎక్కడ బడితే అక్కడ వికల్పానికి చోటున్నది కర్మకాండలో ఉపాసనా కాండలో. కనుకనే దానికి పురుష తంత్రమని పేరు పెట్టింది.

Page 89