#


Back

   ఎన్నో ఆలోచనలు వస్తుంటే వాటన్నిటినీ త్రోసి రాజని ఒకే ఒక చిత్తవృత్తి దానిమీద ధారావాహికంగా ప్రవహింపజేస్తానంటావు. అలా చేస్తే అది బ్రహ్మమున్నట్టుగా నీవు భావించటం కాదు. నీవు భావించినట్టుగా బ్రహ్మముందనుకొని చేసే ప్రయత్నం. మరి ఇలాంటి ప్రయత్నం వస్తు స్వభావాని కవిరోధి ఎలా అవుతుంది. మీదు మిక్కిలి దానికి విరోధి అయి పరిణమిస్తుంది.

   పోనీ బ్రహ్మమెలా ఉందో అలాగే దాన్ని భావిస్తానంటావా. అప్పుడది మొదటికే మోసం దెస్తుంది పొమ్మన్నారు భగవత్పాదులు. ఎందుకంటే ఆ పక్షంలో అది ఇక ఉపాసనే గాదు. ఉపాసన కాకపోతే మరేమిటి. మేము చెప్పే జ్ఞానమే అవుతుందది. ఒక పదార్ధమున్నదున్నట్టు గ్రహిస్తే అది జ్ఞానం. మన ఇష్టానుసారం ఒక రూపకల్పన చేసి చూస్తే అది ధ్యానం. జ్ఞానానికీ Realisation ధ్యానానికి Reflection చాలా తేడా ఉంది. ఒకటి ప్రమ అయితే మరొకటి కేవలమూ భ్రమ. ప్రస్తుతం బ్రహ్మతత్త్వాన్ని ఉన్నదున్నట్టు భావిస్తానంటావు నీవు. భేషుగా భావించు అలా భావించమనే మేమూ చెప్పటం. అయితే ఇక దాని కుపాసన అని మాత్రం పేరు లేదు. మొత్తాని కెగదీస్తే బ్రహ్మహత్య - దిగదీస్తే గోహత్య. మనం భావించినట్టు పదార్థముండాలనుకున్నామా అది బ్రహ్మమే గాదు. బ్రహ్మమున్నట్టు గానే భావిద్దామా అప్పుడది ఉపాసనే గాదు. ఉపాసనా అయి బ్రహ్మమూ కావాలంటే అది కలలోని వార్త. కనుకనే “నేదమ్ యదిద ముపాసతే" అని శాస్త్రం ఘోషించటం. మరి ఆశాస్త్రమే సగుణోపాసన ఎలా చెప్పిందని శంకించవచ్చు. అది నీబోటి నాబోటి మధ్యమాధికారులను దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాటేకాని శాస్త్ర తాత్పర్యం కాదు. అంచేత బాహ్యమైన కర్మ కలాపమెలా పనికిరాదో అంతరమైన ఉపాసనా అలాగే పనికి రాదు బ్రహ్మదర్శనానికి. బ్రహ్మమనేది తయారయ్యే పదార్థం కాదు కాబట్టి కర్మ పనికిరాదు. అనుకొన్నట్లల్లా మారేది కాదు కాబట్టి ఉపాసనా పనికి రాదు.

   భగవత్పాదులివి రెండూ పనికిరావని చాటటంవల్ల సాధకులైన వారికొక గొప్పసలీసు దొరికింది. సాధన మార్గం కూడా ఎంతో తేలిక పడింది. ఎలాగ అని అడగవచ్చు. మోక్షాన్ని సాధించాలంటే మానవుడిక బాహ్యమైన కలాపమేదీ పాటించనక్కరలేదు.

Page 88