#


Back

   నీ కంటే సర్వవిధాలా భిన్న మా దేవత. నీ వుపాసకుడవైతే అది నీ కుపాస్యం. కనుక భావన అనేది సాధ్యమక్కడ. మరి ఇక్కడ బ్రహ్మవిషయంలోనో అలా కాదు. నామ రూపాదికమైన ఏ గుణమూ లేదు దానికి. పైగా నీకు ప్రమేయం కాదది. నీ స్వరూపమే అయి కూచుంది. అలాంటి దాన్ని నీవెలా ఉపాసిస్తావు. కనుకనే “త దేవ బ్రహ్మ త్వమ్ విద్ధి-నేదమ్ యదిద ముపాసతే” అని బ్రహ్మ విషయంలో ఉపాసనాకాండను నిర్మోగమోటంగా ఖండిస్తుందుపనిషత్తు.

   కాకపోయినా బ్రహ్మస్వరూపాన్ని నీవు భావన చేయటమేమిటి. అది ఉన్నట్టు నీవు భావించవలెనా - నీవు భావించనట్టది ఉండవలెనా ఏమిటి నీ ఉద్దేశమని నిలదీసి ప్రశ్నిస్తారు జగద్గురువులు. దీనికి సమాధానమే ఉపాసకుడూ చెప్పలేడు. భయపడతాడు. ఎందుకంటే బ్రహ్మమనేది మిగతా దేవతా మూర్తుల వంటిది గాదు మనమెలా భావిస్తే అలా భాసించటానికి. మన భావనను బట్టి మారేది కాదది. మారితే అది బ్రహ్మమేగాదసలు. స్వతస్సిద్ధమైన తత్త్వం కాబట్టి మొదటి నుంచీ ఎలా ఉండాలో అలాగే ఉంటుందది. పురుష తంత్రం కాదది వస్తుతంత్రమని పేర్కొన్నాము. ప్రతి వస్తువుకూ లోకంలో స్వభావ Characteristic feature మనేది ఒకటి ఉంటుంది. అగ్నికి ఉష్ణత్వ మనేది స్వభావం. నీటికి శైత్యమనేది స్వభావం. వాటిని భావించేటప్పుడంతా అలాగే భావించాలి మనం. అంతేగాని నిప్పును చల్లగా నీళ్ళను వేడిగా ఉన్నట్టు భావించరాదు. ఒకవేళ నీళ్ళు వేడిగా ఉన్నట్టు కనిపిస్తే అది అగ్ని సంపర్కం వల్ల ఏర్పడ్డ గుణమే గాని దాని సహజ గుణం కాదు. కాబట్టి వస్తు స్వభావమని గ్రహించేటపుడు దాన్ని స్వభావాన్ని బట్టే గ్రహించాలి గాని మన ఇష్టానుసారంగా భావించరాదు. అలా భావిస్తే అది ప్రమ Right apprehension అనిపించుకోదు. భ్రమ Wrong apprehension అనిపించుకొంటుంది. ఒక స్థాణువును piller చూచి పురుషుడని భావిస్తే అది యథార్థమెలా అవుతుంది. వట్టి భ్రాంతేనంటాము దాన్ని మనం.

   అలాగే ప్రస్తుత మీ బ్రహ్మమనేది అమూర్తమూ - సర్వవ్యాపకమూ-ఆత్మరూపమూ Subjective అయిన ఒకానొక వస్తువు Substance ఇది దాని స్వభావం. దీన్ని నీవెలా భావిస్తున్నావు. ఒక దేవతా రూపంగా- బాహ్యమైతే ఒక శిలావిగ్రహంలోనో అంతరమైతే ఒక హృదయ కుహరంలోనో ఎక్కడో ఒకచోట నిలుపుకొని చూస్తానంటావు.

Page 87