#


Back

   ఆ శబ్దాని కవయవార్ధం చూచినా మనకర్ధమవుతుందీ విషయం. ఉప అంటే దగ్గరగా ఆసన అంటే కూర్చోటం. మనం పెట్టుకొన్న ఒక లక్ష్యానికి సమీపంగా వెళ్ళి కూచోటమని అర్ధం. వెళ్ళటమూ - కూచోటమనే పాటికే అది ఒక క్రియ. మహా అయితే - మామూలు కర్మ శారీరకం. ఇది మానసికం. అంతమాత్రమే తేడా. మానసికమైన మాత్రాన కర్మ కర్మ కాకుండా పోదు. ఎంత సూక్ష్మమైనా ఇందులో కూడా చాలా తతంగమున్నది. మనసేగాక మిగతా కరణాలు కూడా పనిచేస్తాయి ఇందులో. మనసుతో ఒక మూర్తిని దర్శిస్తూ - వాక్కుతో దానికి సంబంధించిన మంత్రాన్ని ఉచ్చరిస్తూ -చేతులతో దాని కనుగుణమైన అర్చనాది క్రియల నాచరిస్తూ పోతే అది గదా ఉపాసన Worship అంటే. మరి దానిలో బాహ్యమైన వ్యాపారం కూడా చోటు చేసుకొన్నది గదా.

   అలా కాదు - కేవలం మనసులో సాగించే ధ్యానమే Meditation ఉపాసన అంటావా? అదీకర్మే. ఎలాగంటే ధ్యానిస్తూ కూచున్నంతసేపు ఒక మూర్తి నీ మనోనేపథ్యం Mental screen మీద గోచరిస్తూనే ఉంటుంది. దాన్ని నీవు అంతర్ముఖమైన దృష్టితో చూస్తూనే ఉంటావు. ఇక కర్మ కాకపోయిందేమిటి. పైకి కనిపించకుండా లోపల జరిగే కర్మ ఇది. ఇందులో కూడా ముందు చెప్పిన ఉత్పత్త్యాదులు నాలుగూ ఉన్నాయి. నీ మనసులో అంతకుముందు లేని ఒక దేవతామూర్తి నీవు తయారుచేసుకొంటున్నావు. కాబట్టి అది ఉత్పత్తే. పోతే ఆ రూపం నీకు దూరమై పోకుండా నీ మనసులోనే నిలుపుకోవాలని చూస్తున్నావు. ఇదే ఆప్తి. ఆ మీదట దానికి కొన్ని హంగులూ రంగులూ చేర్చి సర్వాంగ సుందరంగా మలుచుకొని తిలకిస్తావు. అది సంస్కృతే. చివరకు దాన్ని నిలుపుకోకపోతే నీ మనోమందిరం నుంచి చెప్పకుండా పారిపోతుంది. లేదా అంత పుణ్యం పుట్టి ఆ దేవతా సాయుజ్యమే పొందావంటే అసలే పారిపోతుంది. మరి వికృతే గదా. అంచేత మానసికమైనా ఉపాసన కూడా గొప్ప గాదు. అదీ ఒక కర్మభేదమే.

   అంతేకాదు. ఉపాసన- ఉపాసన అని వాపోతున్నారు. ఉపాసన అంటే ఏమిటి మీ అభిప్రాయం. మిగతా ఇంద్ర వరుణాది దేవతా మూర్తులలాగా ఆ బ్రహ్మతత్త్వాన్ని కూడా మనసులో భావించటమనే గదా. అలా ఎన్నటికీ జరగబోదు. ఏమి కారణం. దేవతల కంటే ఏదో ఒక నామమనీ, రూపమనీ ఉంది. అదికూడా నీవు కాదు.

Page 86