#


Back

   పోతే ఇక సంస్కృతి. ఇది అసలే సాధ్యం కాదు. దేన్నీ అంటీ ముట్టకుండా అంతటా పన గలిసి ఉన్న పదార్ధమది. దానికొక నామం లేదు. రూపం లేదు. నామరూపాలు రెండూ లేకుంటే అది అమూర్తం. దానికే గుణదోషాలు గానీ అంటవు. ఇక గుణాన్ని ఆరోపించటమెలాగ. దోషాన్ని తొలగించటమెలాగ. అంచేత సంస్కృతి గంధం కూడా లేదు బ్రహ్మతత్త్వానికి, సంస్కృతి మాదిరే ఆఖరుదైన వికృతికూడా దాని కనుపపన్నమే Untenable నన్నారు. వికృతి అంటే మారటం కదా. సావయవమైన Divisible పదార్థమైతే అవయవాల Parts హెచ్చుతగ్గుల మూలంగా మారటమనేది సంభవిస్తుంది. నిరవయవమూ నిరాకారమూ అయినదా బ్రహ్మతత్త్వమని నిర్దేశించాము. అలాంటి తత్త్వమిక ఎలా మారగలదు. మారకపోతే దానికి వికృతి అనే దోషం కూడా లేదనే గ్రహించవచ్చు. మొత్తంమీద నాలుగు రకాలైన కర్మలూ దానిమీద పని చేయటం లేదు. వాటి స్పర్శకూడా సహించని తత్త్వమది. అంటే కర్మకది ఏమాత్రమూ గోచరం కాదన్నమాట. అలా కాని పక్షంలో మరి కర్మ అనేది దానికి సాధనమెలా కాగలదు. కావటాని కసలు వీలే లేదని ఘంటాపథంగా చాటారు భగవత్పాదులు.

   కర్మ కాకపోతే పోనీయండి. ఉపాసన అనేది ఏమైనా పనికి వస్తుందేమో దాన్ని సాధించటానికని చాలామంది కొక అపోహ ఉంది ఉపాసన-భక్తి-ధ్యానం అన్నింటికీ ఒకటే అర్థం. ఉపాసన అన్నా అదీ ఒక కర్మే గదా మరలా ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందని అడగవచ్చు. అదీ ఒక కర్మే అయినా బాహిర External మైన తతిమా కర్మలలాంటిది గాదది. అంతరమైన Internal మనోధర్మం. బాహ్యమైనది స్థూలమైతే ఇది మానసికం కాబట్టి చాలా సూక్ష్మమైనది. తైల ధారావత్తుగా ప్రసరించే ఒక విశిష్టమైన మనోవృత్తి ఇది. అంచేత బాహ్యమైన కర్మ ఒకవేళ దానికి సాధనం కాకపోయినా ఇది కేవలమనోవృత్తి రూపమైన కర్మ కాబట్టి కావచ్చుననే అభిప్రాయం కలగవచ్చు.

   అదికూడా వట్టి అపోహేనని త్రోసి పుచ్చారు స్వామివారు. వారు దానికి చెప్పే సమాధానమేమంటే నీవెంత సూక్ష్మమని వర్ణించినా ఉపాసన అనేది కూడా ఒక కర్మే.

Page 85