వికృతి అంటే దానిలోనే ఏదో మార్పు వచ్చి అది సక్రమంగా క్షీణించి చివరకు నశించిపోవటం. ఇంతకూ ఒక పదార్థం పుట్టి భూమిమీద పడ్డప్పటి నుంచీ మరలా గిట్టి భూమిలోకి పోయేంతవరకూ జరిగే వ్యవహారమిదంతా.
ఇందులో ఉత్పత్తి అనేది మొదటి దశ అయితే- వికృతి అనేది చివరి దశ. మిగతా ఆప్తి-సంస్కృతి అనేవి రెండూ వాటి మధ్య దశ. ఇవి నాలుగూ కలిసి ఒక పదార్థం తాలూకు ఆది మధ్యాంతాలను నిర్ణయిస్తాయి. అది స్థావరమేకాదు. జంగమమే కాదు. ప్రపంచంలో కనిపించే ఏ పదార్థమైనా తీసుకొని చూడు. ఈ వర్ణించిన దశలన్నింటికీ అది గురి Victim కావలసిందే. ఉదాహరణ కొక ఘటమనే పదార్ధాన్నే తీసుకొని చూతాము. ఘటమనేది ఒక కుమ్మరివాడు చేస్తే తయారవుతుంది. అది ఉత్పత్తి. కొని ఇంటికి తెస్తే మన పాలబడుతుంది. ఇది ఆప్తి. తుడిచి శుభ్రం చేసి బియ్యమూ-బేడలూ-పోస్తే మనకుపయోగపడుతుంది. ఇది సంస్కృతి. తరువాత కొన్నాళ్ళకు ఓడు మోసి పగిలి చూర్ణమై మట్టిలో కలిసిపోతుంది. ఇది వికృతి. ఇలా ఘటమేమిటి - పటమేమిటి. అణువు మొదలు ఆకాశందాకా పిపీలిక నుంచి బ్రహ్మదాకా - అన్ని పదార్ధాలకూ ఇదే వరుస. ఈ చతుర్ముఖ వ్యూహాన్ని తప్పించుకొని బయటపడేది ఏదీలేదు.
అయితే ఎంత దుర్భేద్యమైనా ఈ కర్మమనే పద్మవ్యూహ మొక్క బ్రహ్మతత్త్వం మీద మాత్రమే పని చేయలేదు. ఎందుకంటే బ్రహ్మమనేది మిగతా ప్రాపంచిక పదార్ధాల మాదిరి మనం క్రొత్తగా తయారుచేసే దినుసుగాదు. ఎప్పటినుంచో తయారయి ఉన్న పదార్ధమది. నిత్య సిద్ధమని గదా మనం దాన్ని నిరూపించాము. అలాంటప్పుడది ఎలా తయారవుతుందని. పైగా ఈ కనిపించే ప్రపంచానికంతటికీ అది కారణం. ఆ కారణానికిక కారణం లేదు. కారణం లేకుంటే ఏదీ గానీ తయారుకావట మసలు సంభవమే కాదు. కాబట్టి దానికుత్పత్తి లేదు. అలాగే ఆప్తి కూడా లేదు దానికి. ఆస్తి అంటే ఏమిటి. దూరంగా ఉన్నదాన్ని దగ్గరగా తెచ్చుకోవటం గదా. అంతటా ఉన్న పదార్థం బ్రహ్మమంటే. అంతటా ఉన్నదది. అన్నిటిలోనూ ఉన్నది. ఆకాశంలాగా అది సర్వగతం. మన లోపలా వెలపలా కూడా అదే. అసలు మనం కూడా దానికి భిన్నంగా లేము. అలాంటప్పుడు దాన్ని మనం దగ్గరగా తీసుకోవటమేమిటి. అర్థం లేని మాట. కాబట్టి ఆప్తి కూడా లేదు బ్రహ్మానికి.
Page 84