ఈ విధంగా కర్తృకారక క్రియాఫలాలని నాలుగంశాలు అనివార్యంగా ఉంటాయి ప్రతిపనిలోనూ అవి నాలుగూ ఉంటే ఇక అది ద్వైత ప్రపంచం క్రిందికే వస్తుంది. ద్వైత రూపమైన ఈ సాధన మద్వైత తత్వాన్ని అందుకోటానికెలా పనికి వస్తుంది. అద్వైతాన్ని అందుకోటాని కద్వైతమే కావాలి సాధన. ఉత్తర ధ్రువానికి పోవలసినవాడు ఉత్తరంవైపే ప్రయాణం చేయాలి గాని -దానికి విలోమంగా దక్షిణంవైపు చేస్తే ఏమి ప్రయోజనమని ఆక్షేపిస్తారు భాష్యకారులు.
కాబట్టి ద్వైతరూపమైన కర్మ అద్వైత సత్యానికి సాధనం కాదు. పైగా మనమెడకు చుట్టుకొన్న సంసారపాశాన్ని పోగొట్టుకొంటే గదా మోక్షం. దాన్ని సంసారానికి విరోధి అయినదే సాధించవలసి ఉంటుంది. కర్మకూ సంసారానికీ అలాంటి విరోధం లేదు. మీదు మిక్కిలి దానికి సజాతీయమైనది కర్మ. ఎలాగంటే సంసారబంధమనేది మానవుడి అజ్ఞానంవల్ల ఏర్పడింది. అజ్ఞానంవల్ల ఏర్పడిందే కర్మకూడా. రెండూ అజ్ఞాన రూపాలే అయినప్పుడవి ఒకదానికొకటి ప్రతికూలమెలా అవుతాయి. ప్రత్యుత అనుకూలమయి మనప్రాణం తీస్తాయి. అందుకే “నహి తమస్తమసో నివారకమ్ భవతి” అంటారాచార్యులవారు. చీకటి తొలగిపోవాలంటే వెలుతురు కావాలి గాని మరలా ఇంత చీకటి తెచ్చి దానికి కలిపితే ఏమి సుఖం. కనులు పొడుచుకొన్నా కానరాని కటిక చీకటి అవుతుందది. అలాగే కర్మ భూమికకు దిగేకొద్దీ సంసారాన్ని అది ఇంకా ద్విగుణీ కృతం చేస్తుంది. దానిలో నుంచి మనమిక ఎప్పటికీ తేరుకోలేము.
అంతేకాదు. కర్మ అనేది ఏదయినా సరే. అది నాలుగే నాలుగు మార్గాలలో నడుస్తుంది. ఒకటి ఉత్పత్తి. రెండు ఆప్తి. మూడు సంస్కృతి. నాలుగు వికృతి. ఉత్పత్తి అంటే ఒక వస్తువు తయారుకావటం. ఆప్తిఅంటే ఆ తయారయిన పదార్ధం చేతికి రావటం. సంస్కృతి అంటే చేతికి వచ్చిన దాన్ని శుద్ధి చేయటం. అది రెండు విధాలు. వస్తువులో దోషముంటే దానిని తొలగించటమొకటి. గుణమనేది లేకుంటే దానిని కలిగించట మొకటి. లోకంలో మనం సంస్కృతి - సంస్కరణమని వర్ణించేది ఏదైనా ఇంతే. దోషాపనయనమూ గుణాధానమూ ఇంతకుమించి మరేమీ లేదు. పోతే ఇక నాలుగవది వికృతి.
Page 83