సాధన అన్నా, క్రియ అన్నా, కర్మ అన్నా, అనుష్ఠానమన్నా, అన్నీ ఒక దానికొకటి పర్యాయాలే Synonyms అయితే లౌకికమైన సాధనలన్నింటిలోనూ మనం చెప్పుకొనే ఈ సూత్రానికి తిరుగులేదు. కాని ప్రస్తుత మీ అద్వైత సాధనలో మాత్రమిది ఏ మాత్రమూ చెల్లనేరదని సెలవిచ్చారు శంకర భగవత్పాదులు ఎంచేతనంటే అది వస్తుతంత్రమే The thing as it exists గాని పురుషతంత్రం The thing as we think of it కాదని సమాధాన మిస్తారాయన. వస్తు తంత్రమేమిటి- పురుషతంత్ర మేమిటి అని ప్రశ్నించవచ్చు. తంత్రమంటే ఒక దాని కధీనమయి ఉండటం లేదా దానిమీద ఆధారపడటం అని అర్ధం. ఆయా వస్తువుల స్వభావం మీదనే ఆధారపడిందయితే అది వస్తుతంత్రం. అలా కాకా ఒకానొక పురుషుడి మీద ఆధారపడిందయితే పురుష తంత్రం. పురుషుడంటే పురుషుడి బుద్ది. మానవుడు తన బుద్ధితోనే గదా ఏ విషయమైనా ఆలోచించి గ్రహిస్తాడు. కనుకనే దీనికి పురుష తంత్రమనే కాక బుద్ది తంత్రమని కూడా పేరు వచ్చింది. ఈ బుద్దే మానవుడు చేసే సకల వ్యాపారాలకూ కర్తృత్వం వహిస్తుంది. దీని తోడ్పాటు లేకుండా శరీరంలో ఏ ఇంద్రియంగానీ ఏ ఒక్కపనీ సాగించలేదు. అంచేత కర్తృతంత్రమని కూడా దీన్ని వ్యవహరిస్తారు. మొత్తానికి పురుషుడైనవాడు ఏదైనా తన బుద్ధితోనే మొదట ఆలోచిస్తాడు. అదేమాటలతో చెబుతాడు. చేతలతో చేసి చూపుతాడు. కాబట్టి అంతా కలిసి చివరకు పురుష తంత్రమే అవుతుంది.
ఇలాంటి పురుష తంత్రం కాదు అద్వైతులు చెప్పే బ్రహ్మపదార్థం. అది కేవలం వస్తుతంత్రమే. వస్తు స్వరూపాన్ని అనుసరించేది వస్తుతంత్రమని గదా పేర్కొన్నాము. వస్తు స్వరూపమేమిటిక్కడ. జీవజగత్తులనే వాసన కూడా లేని అద్వితీయాఖండ రూపమైన చైతన్యం. అదే గదా బ్రహ్మమంటే. ఇలాంటిదీ ఆ వస్తు స్వరూపం. ఇలాంటి స్వరూపం పురుషతంత్రమెలా అవుతుంది. కర్మ అనే దాని కవకాశముంటే గదా పురుషతంత్రమయ్యేది. రెండవ పదార్ధమే లేదన్నప్పుడు కర్మ కవకాశమెక్కడిది. కర్మ అనగానే అది ఒకటి గాదు. కర్మ చేసే వాడొక్కడు - వాడు కర్త. చేయటానికి కావలసిన పరికరాలొకటి అది కారకం. చేయటమనే పని ఒకటి. అది కర్మ. అలా చేయటం మూలంగా మనం సాధించే దొకటి అది ఫలం.
Page 82