కనుకనే అతడు తెలివిగా చూడగలడు మాటాడగలడు. రేపటి విషయ మూహించగలడు. మంచి చెడ్డలను విభజించి చూడగలడు. మర్త్య జగత్తులో పుట్టి అమర్త్యత్వాన్ని పట్టుకోవాలని ఆకాంక్షించగలడు. అని తైత్తిరీయ మెంతగానో మానవుడి పూర్ణత్వాన్ని వర్ణించింది. ఇలాంటి పూర్ణత్వం Perfection పశుపక్ష్యాదులకు లేదని కూడా చాటింది. “అథేత రేషామ్ పశునామ్ ప్రాయశో2 శనాయా పిపాసే అభివిజ్ఞానమ్” ఇక మిగతా జీవరాసుల విషయమో కేవలమూ క్షుత్పిపాసాదులైన శరీర ధర్మాలే వాటికున్న విజ్ఞానం. మొత్తానికి దేహేంద్రియ ప్రాణ మనో బుద్ధ్యాది పరికరాలన్నీ సమగ్రంగా ఉన్నవాడు మానవుడే. ఇలాంటి సామర్థ్యమూ అర్థిత్వమూ రెండూ ఉన్న అధికారి కావటం మూలాన్నే మానవుడొక్కడే మోక్షసాధన చేయవలసి వస్తున్నది.
అయితే సాధన చేయాలన్నారు - బాగానే ఉంది. అది ఎలా చేయాలా సాధన అని ఇప్పుడు రెండవ ప్రశ్న. సాధన అనే మాట వినగానే మనకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చేది ఒక అనుష్ఠాన రూపమైన Practical క్రియ. లోకంలో మనమే ఒక్కటి సాధించాలన్నా ఏదో ఒక క్రియతోనే సాధించాలి దాన్ని. ఏ పనీ చేయకుండా మనపాటికి మనం మౌనంగా కూచుంటే ఆ కర్మమెలా సిద్ధిస్తుంది. అసలు సాధన అంటే ఏమిటర్ధం. అంతకుముందు లేని ఒక వస్తువును క్రొత్తగా తయారు చేసుకోవటమో లేక ముందే తయారయి కూడా మనకు దూరంగా ఉన్న పదార్ధాన్ని దగ్గరగా తెచ్చుకోటమో ఇంతే గదా. తయారు చేయటం - తేవటం - పొందటమని ఏది చెప్పినా అది ఒక క్రియే. ఇంతెందుకు. ప్రస్తుతం మనం నివసించటాని కొక కొంప అనేది లేదనుకోండి. చేతిలో తగినంత ద్రవ్యముంటే చాలు. వెంటనే ఒక గృహం కట్టుకొని అందులో ప్రవేశిస్తాము. లేదా అంతకు పూర్వమే మన తండ్రులో తాతలో కట్టిన ఇల్లుంటే సరి. అదే బాగుచేయించుకొని గుట్టుచప్పుడు గాకుండా అందులో చేరిపోతాము. మొదటిది క్రొత్తగా నిర్మాణం కావటమైతే రెండవది నిర్మాణమైన దాన్నే మన సొంతం చేసుకోవటం. ఇందులో ఏదైనా ఒక క్రియే గాని మరేదీ గాదు. కాబట్టి సాధన అని ఎప్పుడు చెప్పినా అది ఒక క్రియ అనే భావించవలసి వస్తుంది.
Page 81