#


Back

   ఈ సమస్య జగత్తుకు లేదు. ఈశ్వరుడికీ లేదు. ఎందుకంటే జగత్తంటేనే సంసారం. సంసారం దాని స్వరూపమే అయినప్పుడు దానికది సమస్య ఎలా అవుతుంది. మీదు మిక్కిలి అదే సమస్య మన పాలిటికి. అలాగే ఈశ్వరుడికి కూడా లేదీ సమస్య. సంసారమే గదా సమస్య అని పేర్కొన్నాము. ఇది ఆ ఈశ్వరుడు సృష్టించిందే. ఆయన మాయాశక్తి విలాసమే ఇది. తన మాయే తన్ను ఎలా బాధించగలదు. గారడీ వాడిని వాడి గారడీ విద్య బాధించనేరదు గదా. కాబట్టి ఈశ్వరుడికీ సమస్య లేదు. పోతే పరిశేష న్యాయంగా మనబోటి జీవకోటిదే ఈ సమస్య అంతా. సంసారమనే సాగరంలో బడి నిరంతరమూ తలమునకలవుతున్న వాళ్ళము మనమే. కాబట్టి మనలాంటి జీవుడే ఎప్పటికైనా దీనికి పరిష్కారమార్గ మాలోచించవలసిన వాడు. మరెవరూ గాదు.

   మరి ఒక రహస్యం కూడా ఉంది మనం గమనించవలసింది. సమస్య ఎలా ఉందో - సాధన చేసి దాన్ని పరిష్కరించుకొనే యోగ్యతకూడా ఈ జీవుడికే ఉంది. దీనికే అధికార Comptetence మని పేరు. ఈ అధికారమనేది రెండు విధాలన్నారు శంకరులు. ఒకటి అర్దిత్వమూ Desire రెండు సామర్ధ్యమూ Equipment అర్దిత్వమంటే మనకొక సమస్య ఉందని గమనించి దానిని తొలగించుకోవాలని కోరిక. కాని అది వట్టి కోరిక మాత్రమే అయితే ప్రయోజనం లేదు. గొంతెమ్మ కోరికే అవుతుందది. అంచేత దానితోపాటు సామర్థ్యం కూడా ఉండాలి మనకు. సామర్థ్యమంటే ఏమిటి. ఒక సమస్యను నిర్మూలించుకోటానికి కావలసిన సామగ్రి.

   ఇవి రెండూ మానవుడికే ఒనగూడాయి సృష్టిలో. మరి దేనికీ కానరాదు. శిలామృత్తికాదులసలు ప్రాణానికే నోచుకోలేదు. వృక్ష లతాగుల్మాదులకు ప్రాణమైతే ఉంది గాని జ్ఞానంలేదు. మరి పశుపక్ష్యాదులకు ప్రాణమూ ఉంది. జ్ఞానమూ ఉంది. కాని ఆ జ్ఞానం కేవలం వాసనా జ్ఞానమే Instinct. వివేక జ్ఞానం Reason కాదు. ఒక్క మానవుడిలోనే ప్రాణమూ, జ్ఞానమూ, వివేకమూ అన్నీ పరిపూర్ణమైన స్థాయినందుకొన్నాయి. కనుకనే పురుషుడని పేర్కొన్నారు మానవుణ్ని. “పురుష ఏవా విస్తరామాత్మా సహి ప్రజ్ఞానేన సంపన్న తమః - విజ్ఞాతమ్ వశ్యతి - విజ్ఞాతమ్ వదతి-వేత్తి శ్వస్తనమ్-వేత్తి లోకాలోకౌ - మర్త్యేనా 2 మృత మీక్షతి” పురుషుడిలోనే ఆ విశ్వచైతన్యం మరలా అభివ్యక్తమయింది.

Page 80