వ్యావహారికాన్ని బట్టి మనమెప్పటికైనా పారమార్థికమైన బ్రహ్మతత్త్వాన్ని పట్టుకోవాలని గడచిన అధ్యాయంలో మనవి చేశాము. ప్రస్తుతమలా పట్టుకోవలసిన వాడెవడు - పట్టుకొనే మార్గమేమిటి అని విచారణ చేయవలసి ఉంది. తత్త్వాన్ని అందుకోవాలనే సరికి మనమింకా అప్పటికి వ్యావహారికంలోనే ఉన్నామని అర్థం. అంటే ఏమన్నమాట. జీవుడూ, జగత్తూ, ఈశ్వరుడూ, అనే ఈ మూడు తత్త్వాల దగ్గరికీ మరలా వచ్చిపడ్డాము. ఈ మూడింటిలో బ్రహ్మతత్త్వాన్ని సాధనచేసి అందుకోవలసింది ఎవరు అని మొదటి ప్రశ్న.
ఎవరు అని ప్రశ్నే లేదు. సాధన చేయవలసిన వాడు జీవుడేనని సమాధాన మిచ్చారు వేదాంతులు. ఎంచేతనంటే జీవుడు కాక ఇక రంగంలో ఉన్నవి రెండే. ఒకటి జగత్తు రెండు ఈశ్వరుడు. ఇందులో జగత్తనేది కేవల మచేతనమైన పదార్ధం. సాధన చేసే యోగ్యత దానికి లేదు. పోతే పరమేశ్వరుడు. అది పరిపూర్ణమైన చేతన పదార్ధం. సాధన చేయవలసిన అగత్యం దానికి లేదు. కాగా అటు జగత్తులాగా కేవల మచేతనుడుగాక ఇటు ఈశ్వరుడిలాగా పరిపూర్ణ చేతనుడూ కాని వాడీ జీవుడే. చైతన్యముంది గాని అది ఈశ్వరుడికి లాగా పరిపూర్ణంగా లేదు. పరిపూర్ణం చేసుకోగలిగితే చాలు. ఈశ్వరుడే అవుతాడు జీవుడు. కనుకనే సాధన చేయవలసిన భారం జీవుడి మీదనే పడింది. వాడికే అది అవసరం. అంతేకాదు. సాధన అంటే అది ఒక పరిష్కారం Solution లాంటిది. సమస్య ఉంటేనే పరిష్కారం. అది ఎవడికి ఉంటే వాడే చేసుకోవలసి వస్తుంది. ఎవడికుంది ఇప్పుడు సమస్య. జీవుడికే. వానినే ఈ సంసారమనే సమస్య పట్టి బాధిస్తున్నది. “అనిత్య మసు ఖమ్ లోక” మన్నది భగవద్గీత. దీనివల్ల లేశమాత్రం కూడా సుఖం లేదు. ఎప్పుడో కొంచెమున్నా అది శాశ్వతం కాదు. కాబట్టి ఇది నిజంగా సమస్యే.
Page 79