అదే మనకు నిత్యమూ ఎదురయ్యే ఈ సాంసారికమైన తాపత్రయం. అంచేత ఈ పద్మవ్యూహం నుంచి బయట పడటానికి మానవుడవశ్యంగా ప్రయత్నించవలసి ఉంది. అయితే ఎలా చేయాలా ప్రయత్నం. ఈ అనర్థం దేని మూలాన ఏర్పడుతున్నదో ఆ నిమిత్తాన్ని తొలగించాలి. నిమిత్తం పోతే నైమిత్తికం దానిపాటికదే పోతుంది. నిమిత్తమేమిటి. అనాది ప్రవృత్తమైన మన అజ్ఞానం. అజ్ఞానానికి విరుగుడు జ్ఞానమే. జ్ఞానమంటే అంతా బ్రహ్మమేనని దర్శించటం. అది ప్రస్తుతం లేదు మనకు. ప్రస్తుతం మనకున్నది దానికి భిన్నమైన లోకదృష్టి. ఇదే వ్యావహారిక మంటే. దీనినంతకంతకు వదలుకొంటూ దానిని పట్టుకోవాలి మనం. అలా పట్టుకోవాలంటే ఈ వదలుకొనేదే మరలా దాని కాలంబనం. వజ్రమ్ వజ్రేణ భిద్యతే అన్నారు. అంచేత వ్యావహారికాన్ని తోడు చేసుకొనే వ్యావహారికానికి స్వస్తి చెప్పి సాధకుడైన ప్రతివాడూ ఈ సర్వమూ బ్రహ్మమనే పారమార్థిక జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవాలని పిండితార్థం.
Page 78