సాధించిన అన్ని విజ్ఞానాలకూ ఆఖరిమెట్టు అద్వైత విజ్ఞానమే. అవి సాపేక్షమైతే Relative ఇది నిరపేక్షం Absolute. అవి సబాధమైతే Contradicted నిర్బాధం Uncontradicted ఇది అద్వైత విజ్ఞానానికుండే విశిష్టత.
ఇలాంటి విలక్షణమైన జ్ఞానాన్ని మనకు బోధించగలిగారంటే అలా బోధించిన భగవత్పాదులెంతటి మహనీయులో వేరుగా చెప్పబని లేదు. అసలు వారికి భగవత్పాదులని బిరుద మేర్పడటంలోనే మనకీ విషయ మవగత మవుతుంది. తెలియవలసినదంతా తెలుసుకొని దాన్ని అనుభవానికి తెచ్చుకొన్న పూర్ణ పురుషులే భగవత్పాదులు. శంకరులలాంటి పూర్ణ పురుషులు. వారికి పరమార్ధమంతా చేతిలో వెన్నముద్దలాగా స్వానుభవానికి వచ్చింది. అనుభవమనేది లేకుంటే ఏదిగానీ ఒక సిద్ధాంతంగా Doctrine or theory బయటికి రాదు. మానవుల సిద్ధాంతాలన్నీ Concepts వారి వారి అనుభవాలకు ప్రతీకలే Indications. సిద్ధాంతా లన్నిటికీ తలమానిక మద్వైత సిద్దాంతమని గదా ప్రతిపాదించాము. అలాంటప్పుడది ఎవరి అనుభవానికి రాకుండానే ఎలా అవతరించగలదు. ఒకవేళ అవతరించిందని వాదించినా దాని కర్థమేముంది. కాబట్టి దాని నొక సిద్ధాంతంగా శంకర భగవత్పాదులు లోకానికి చాటారంటే ఆయన కది ముందుగా అనుభవ గోచరమయి ఉండవలసిందే, ఇందులో అనుభవానికి తెచ్చుకోవటం వల్లనే ఆయన భగవత్పాదులయ్యారు. అలా తెచ్చుకొన్న విజ్ఞానాన్ని మరలా ఈ మానవ సమాజాని కుపదేశించి పోవటంవల్ల ఆయన జగద్గురువులు కూడా అయ్యారు.
అయితే మనకిక్కడ ఒక ఆశంక కలగవచ్చు. శంకరులు బోధించారని చెప్పే ఈఅద్వైత విజ్ఞానమంతకు ముందునుంచీ మన ఉపనిషద్వాఙ్మయంలోనే ఉంది గదా. ఇక ఆయన మనకు క్రొత్తగా చేసిన బోధ ఏమిటి అని. అదీ వాస్తవమే. ఉపనిషత్తులలోనే ఉన్నాయి అద్వైత జ్ఞాన రత్నాలన్నీ. సందేహం లేదు.కాని అవి బాగా లోతుకు దిగి గాలించినప్పుడే చేతికందేది. ఆ పాతతః చూచామంటే వాటిలో ఒక్క అద్వైతమే గాదు. సాంఖ్యయోగాది ద్వైతవాసనలు కూడా గుబాళిస్తుంటాయి. ఎక్కడికక్కడే మనకుపనిషత్తుల భావమిదే కావచ్చుననే భ్రాంతి ఏర్పడుతుంది. మనకేమిటి. అసలు పెద్ద పెద్ద మతాచార్యులకే ఏర్పడింది ఇలాంటి అపోహ. కనుకనే ఎవరికి తోచినట్లు వారు ఉపనిషద్వాక్యాలకు వ్యాఖ్యానాలు వ్రాస్తూ వచ్చారు.
Page 8