#


Back

  ఇది కూడా మన కనుభవ సిద్ధమే. చూడండి. ప్రతి రంగంలోనూ మన మెంతెంతో పరిశోధన చేస్తున్నాము. ఎన్నెన్నో విషయాలు తెలుసుకొంటున్నాము. అవన్నీ అప్పటికప్పుడు సత్యమనే నమ్ముతుంటాము. కానీ అంతకన్నా ముందుకు పోయి మరి ఒక క్రొత్త రహస్యం కనుగొనే సరికంతకు ముందరిదంతా బలాదూరవుతున్నది. అది మరి కొంతదూరం ప్రయాణం చేసే సరికి పేలవమయి పోతున్నది. ఈ విజ్ఞాన యాత్ర ఇలా నిరంతరమూ కొనసాగవలసిందే గనుక చివరకంతా బాధితం కాక తప్పదు. ఏతావతా తేలిందేమంటే మానవుడార్జించిన ఆర్జిస్తున్న ప్రతి ఒక్క విజ్ఞానమూ కూడా అపేక్షా బాధలనే ఈ రెండు దోషాలకూ గురి కావలసిందే. అది నీవు లోకజ్ఞానమని చెప్పు. శాస్త్రమని చెప్పు. కళాఙ్ఞానమని చెప్పు. ఏదైనా సరే. రెండింటి కబంధ హస్తాల నుంచీ తప్పించుకొని బయటపడడం కల్ల.

   కాగా ఈ రెండవ లక్షణాలూ లేని విజ్ఞానమేదైనా ఉందంటే అది ఒక్క అద్వైత విజ్ఞానమే. ఎంచేతనంటే అసలద్వైతమని పేరు పెట్టటంలోనే ఉన్నదా రహస్యం. అద్వైతమంటే ఏమిటి. రెండవ పదార్ధమంటూ ఏదీలేదు. ఉన్నదంతా ఒక్క ఆత్మచైతన్యమే నని గదా, చైతన్యం తప్ప మరొకటేదీ లేదన్నప్పుడిక అపేక్ష ఏముంది. బాధ ఏముంది. ఇది గాక మరొకటున్నదని ఒప్పుకొన్నప్పుడే వాటి రెంటికీ అవకాశమేర్పడేది. లేకుంటే అసలాస్కారమే లేదు వాటికి. అపేక్షా బాధలు రెండూ లేవంటే అది ఒక పరిపూర్ణమైన జ్ఞానం కాక తప్పదు. ఇలాటి పరిపూర్ణమైన జ్ఞానమే అద్వైత జ్ఞానం.

   అంతేకాదు. పరిపూర్ణ మెప్పుడయిందో అప్పుడిక పురుషార్థమనేది కూడా దానితోనే పరిసమాప్తమవుతున్నది. పురుషుడు కోరేదేదో అది పురుషార్ధం The aim and goal of human life. పురుషుడంటే మానవుడే, మానవులందరూ కోరే పదార్థాలు రెండే ప్రపంచంలో. అన్నీ తెలుసుకోవాలని ఒకటి, అనవరతమూ సుఖంగా బ్రతకాలని ఒకటి. ఇంతకు మించి మరేదీ కానరాదు. ఇందులో మొదటి దానికి జిజ్ఞాస అనీ, రెండవదానికి ముముక్ష అనీ పేరు పెట్టారు మన ప్రాచీనులు. ఇవి రెండూ నెరవేరే వరకూ పురుషార్థమనే దానికి మనం నోచుకోలేము. అద్వైత మన్నప్పుడింకొక భావానికే అసలాస్కారం లేదనిగదా చెప్పాము. అలాంటప్పుడిక జిజ్ఞాస ముముక్షలు మాత్రమెక్కడివి. ఇవి కూడా వాటిపాటి కవి సమసి పోవలసిందే. పోతే పురుషార్థమనేది మన కప్రయత్నంగానే సిద్ధిస్తుంది. అంచేత మానవుడు

Page 7