జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులొక అనన్య సామాన్యమైన వ్యక్తి. ఆయన మన భారతదేశంలో జన్మించటం నిజంగా మన భారతీయుల కొక గర్వకారణం. అయితే ఆయన ఏ శతాబ్దంలో జన్మించాడనే విషయం మాత్ర మిప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. క్రీస్తుకు పూర్వమని కొందరంటే తరువాత అని కొందరంటున్నారు. అయినా ఏ శతాబ్దంలో ఎప్పుడు జన్మిస్తేనేమి, ఎప్పుడూ, ఎక్కడా అనేవి మనకు ప్రధానం కావు. ఆయన భాషలోనే చెబితే అవి కేవలం వ్యావహారికమే. అలాంటప్పుడనవసరంగా వాటిని గురించి మనం తలబ్రద్దలు చేసుకోవటం దేనికి. అనావశ్యకం. ఆయన ఎప్పుడైనా జన్మించి ఉండవచ్చు. ఎక్కడైనా జన్మించి ఉండవచ్చు. మొత్తంమీద అలాంటి మహానుభావుణ్ని మాత్రం మనమిక చరిత్రలో మరలా చూడబోమే. ఏమి కారణం. ఆయన ఈ మానవ లోకాని కుపదేశించిపోయిన విజ్ఞానమలాంటిది. అది పరిపూర్ణమైన అద్వైత విజ్ఞానం. సృష్టికంతా సారం మానవుడైతే- మానవుడికి సారమాతని విజ్ఞానమైతే, ఆ విజ్ఞానానికంతటికీ పరమసారమద్వైత విజ్ఞానమే. అదేమిటి-మానవుడీలోకంలో ఆర్జించిన విజ్ఞానమెంతో ఉంది గదా. లోక జ్ఞానం
Common Sense Scientific sense ముంది.
కళాజ్ఞాన Artistic sense ముంది. ఇన్ని జ్ఞానాలుండగా ఇందులో దేనికీ లేని విశిష్టత ఈ అద్వైత విజ్ఞానానికే ఎలా ఏర్పడిందని ప్రశ్న వస్తుంది వాస్తవమే. మానవుడార్జించిన విజ్ఞానమెంతో ఉంది. సందేహం లేదు. కాని ఎంత ఉన్నా, ఎన్ని ఉన్నా అవన్నీ చివరకు నిరుపయోగమే. కారణమేమంటే వాటిన్నింటిలోనూ రెండు ప్రబలమైన దోషాలున్నాయి. ఒకటి అపేక్ష Relativity. మరొకటి బాధ Controversity అపేక్ష అంటే దీని తరువాత ఏమిటనే ప్రశ్న. ఈ ప్రశ్న మనం సాధించిన ప్రతి విజ్ఞానంలోనూ పొడచూపుతుంది. చూడండి. మనమే విజ్ఞానాన్ని ఎంత సాధించినా ఇంకా సాధించవలసింది ఉండనే ఉంటుంది. సాధించింది ఒక బిందువైతే సాధించవలసింది ఒక మహాసముద్రం. ఎంత ఈదినా దాని తీరం చేరుతామనే ఆశ ఎప్పటికీ లేదు జీవితంలో, కాబట్టి అపేక్ష అనే దోషమొకటి ఉంది మన జ్ఞానానికి.
అలాగే బాధ అనే దోషం కూడా ఒకటుంది. బాధ ఏమిటి. బాధ అంటే మనమెందులో ఎంత జ్ఞానం సంపాదించినా అది పనికి రాకుండా పోవటం.
Page 6