మోక్షపదం చేరేటంతవరకూ సాధకుడు పయనించవలసి ఉంటే మధ్యవచ్చే మజిలీలలోనే నిలిస్తే ఏమి బాగు. కేవల కర్మిష్ఠులూ, ఉపాసకులు, వీరంతా ఇలా మధ్యలో నిలిచిపోయే బాపతువారే. సాధకులే వీరంతా. కాదనలేము. కాని సిద్ధి అనేది కలిగేవరకూ వీరు సాధన చేయటం లేదు. కర్మిష్ఠులకైతే పితృలోక ప్రాప్తే సిద్ధి. ఉపాసకులకైతే ఆయా దేవలోక ప్రాప్తి. వీరందరూ తమ అనుభవం పూర్తికాగానే మరలా ఈ కర్మ భూమికి తిరిగి రావలసిందే. జన్మ ఎత్తవలసిందే తప్పదు. పునరావృత్తి రహితమైన మోక్షసిద్ధి ఈ మార్గంలో పయనించే వారికెవ్వరికీ లేదు. ఏమి కారణం. వ్యావహారికాన్ని కేవలమొక ఆలంబనమని భావించక అదే సర్వస్వమని భ్రాంతి చెందటమే. దానితో మానవుడెంత సాధన చేసినా - ఎంత సన్మార్గంలో పయనించినా అది ఎదుగూ బొదుగూ లేక వామనంగానే సమసిపోతుంది. అంతేగాక “పునరపి జననమ్ పునరపి మరణ" మన్నట్టు మరలా ఈ సంసార సాగరంలో తలమునకలు గాక తప్పటం లేదు. ఇలా రెండనర్థాలెదురవుతాయి ఈ మార్గంలో. ఇదంతా వ్యావహారికాన్ని వ్యావహారికంగానే చూడక అదే పారమార్థికమని భావించటంవల్ల వచ్చిన పెద్ద మోసం. అలా మోసపోవద్దు. దానినే సోపానంగా చేసుకొని మీరు ముక్తి సౌధాన్ని ఆరోహించమని కర్మ మార్గ పరాయణులందరికీ గట్టిగా హెచ్చరిక చేస్తారు భగవత్పాదులు.
పోతే ఇంతకన్నా పెద్ద హెచ్చరిక వారు వేదాంత విద్యా విశారదుల మనుకొనే పెద్ద మనుషులకు కూడా చేయవెనుదీయలేదు. ఆత్మజ్ఞాన గంధం లేక కర్మిష్ఠులు పాడవుతుంటే ఆ జ్ఞానం తమకు లేకపోయినా ఉందనుకొని వేదాంతులు చెడిపోతున్నారు. అసలైన ఆత్మజ్ఞానమున్నదంటే ఇక భేదదృష్టి అనేది అణుమాత్రమైనా ఉండకూడదు. ఏదీ కోతలు కోయటమే గాని అలాంటి అభేద భావన ఎవరికుంది. సర్వసంగ పరిత్యాగులమని చెప్పుకొనే సన్య్యాసులకే లేదు. అలాంటి సన్న్యాసులు కేవల మాశ్రమ సన్న్యాసులేగాని పరమార్థ సన్న్యాసులు గారని పరివ్రాజక సార్వభౌములైన ఆచార్యులవారే సెలవిస్తారు. "జటిలో-ముండీ-లుంచిత కేశః” అని అక్కడక్కడ అవహేళన కూడా చేస్తారు. కాబట్టి బాహిరమైన వేషధారణా, మధుర భాషణా కాదు జ్ఞానమంటే జ్ఞానమున్నందుకు ముందు నీ దృక్పథం మారాలి. అది నీ ప్రవర్తనలో కనపడాలి. ఇలాంటి మహనీయులు భగవత్పాదుల లాగా నూటికి కోటి కొక్కరుంటే ఎక్కువ.
Page 76