#


Back

   కాబట్టి వ్యవహారాన్ని పరమార్థంలో భావించటమెలా తప్పో పరమార్థాన్ని వ్యవహారంలో లేదనుకోవటం కూడా అలాగే తప్పు కారణమేమంటే మనం చూచినా చూడకపోయినా ఉండేది పరమార్థం. చూస్తున్నప్పుడు మాత్రమే ఉన్నది వ్యవహారం. ఇదీ ఇందులో ఇమిడి ఉన్న వ్యవహారం. ఇదీ ఇందులో ఇమిడి ఉన్న రహస్యం.

   అయితే అంతా అయిన తరువాత మనం కడసారిగా గుర్తుంచుకోవలసిన రహస్యమొకటి ఉంది. అది ఆచార్యులవారు విసుగు లేకుండా పదే పదే మనకు హెచ్చరిక చేస్తుంటారు. మనమది గ్రహించకపోతే ఇప్పటివరకూ చెప్పుకొన్న మాటలన్నీ నిరుపయోగమే. అదేమంటే వ్యావహారికం పారమార్ధికమని వర్ణించినంత మాత్రాన నిజంగానే రెండు దశలున్నాయని మనమెప్పుడూ భ్రాంతిపడరాదు. నిజంగా ఉన్నదెప్పుడూ ఒక పారమార్థికమే. అఖండమైన బ్రహ్మచైతన్యమది. అదే మన అజ్ఞానం వల్ల ఈ వ్యావహారిక జగత్తుగా భాసిస్తున్నది. అజ్ఞానమనేది ఎప్పుడూ ఒక వస్తువు కాదు. అది మన దృష్టి దోషమని పేర్కొన్నాము. ఇలాంటి దృష్టితో మనమే రూపంగా చూస్తే ఆ రూపంగా కనిపిస్తుంది ప్రపంచం. అది బాహ్యమైన భూతప్రపంచమే Material world గాదు. అంతరమైన భావ ప్రపంచం Mental world కూడా అలా కనిపిస్తున్నదే. కనిపిస్తున్నదంతా అజ్ఞాన విలసితమేనని గదా చెప్పాము. అంతా బ్రహ్మమే అయినా మన దృష్టి దోషంవల్ల ఇలా భాసిస్తున్నది. ఉన్నదొక్క రజ్జువే అయినా మన దృష్టిమాంద్యాన్ని బట్టి అదే సర్పదండధారాది రూపంగా భాసించటం లేదా. అలాగే ఇదీ. అంచేత మానవుడికున్న ఈ దృష్టి నాధారం చేసుకొనే శాస్త్రం వ్యావహారికమనీ పారమార్ధికమనీ రెండుగా విభజించి చూపుతున్నది. భగవత్పాదులు కూడా దాని ననుసరించే మనకలా బోధిస్తూ వచ్చారు. అంతేగాని ఇదిశాస్త్ర తాత్పర్యమూ కాదు. ఆయన వివక్షితమంతకన్నా గాదు.

   శాస్త్ర తాత్పర్యమిదే ననుకొంటే అందులో ఎంతైనా ప్రమాదముంది. ఎందుకంటే శాస్త్రమనేది ఒక ప్రమాణం. ప్రమాణమనేది ఎప్పుడూ మనకున్న మిథ్యాజ్ఞానాన్ని పారదోలి సమ్యగ్ జ్ఞానాన్ని Right Knowledge ప్రసాదించాలి. అలాగయితేనే అది ప్రమాణమవుతుంది. లేకుంటే అప్రమాణమే.

Page 74