#


Back

   ఇవన్నీ ఎప్పుడు భావించామో అప్పుడది వ్యావహారికమే. పారమార్థికమెలా అవుతుంది. పైగా ఇందులో రెండు పెద్ద పొరబాట్లున్నాయి. మోక్షమనేది ఎప్పుడో మనకబ్బుతుందంటే ఇప్పుడది లేదన్నమాట. అంతకుముందు లేక మధ్యలో హటాత్తుగా ఏర్పడ్డ దానికెప్పుడూ ఒక ఆది ఉంటుంది. ఆది ఉన్నదంటే దానికంతం కూడా ఉండకతప్పదు. ఆద్యంతాలనేవి ఉన్నప్పుడది శాశ్వతికమెలా అవుతుంది. ఇది ఒక ప్రమాదం. పోతే ఇంకొక ప్రమాద మేమంటే వీరు పరమాత్మను తమకు భిన్నమైన తత్త్వంగా భావిస్తున్నారు. భిన్నమైతే దాని నాత్మ అని వ్యవహరించటానికి వీలులేదు. ఎందుకంటే అప్పుడది మన జ్ఞానానికి విషయ Object మవుతుంది. జ్ఞానానికి విషయమైనది జ్ఞానమెలా అవుతుంది. జ్ఞానం కాకపోతే అది పరమాత్మే గాదు. పరమాత్మ అంటే అఖండ జ్ఞానస్వరూపమని గదా మనం ప్రతిపాదించాము. అలాంటి జ్ఞానానికే దూరమైతే అది ఆత్మ ఎలా అవుతుంది. పరమాత్మ ఎలా అవుతుంది. అంచేత వ్యవహారలేశం కూడా పరమార్థంలో భావించటంగాని అలా వర్ణించటంగాని, పొరబాటని గ్రహించాలి మనం.

   అలాగే పరమార్థమనేది మాత్రం ఎంత వ్యవహార దశలోనైనా సరే అంతర్లీనమయి ఉంటుందనే సత్యాన్ని మనం మరవ రాదంటారు శంకరులు. అయితే ద్వైతవాదులిది కూడా పూర్తిగా విస్మరించారు. విస్మరించటం వల్లనే వారి దృష్టికి భౌతికమైన ప్రపంచంలో ఎక్కడా బ్రహ్మమనేది గోచరించటం లేదు. గోచరించకనే దీనికతీతంగా ఎక్కడో ఉందని భావించి అక్కడికి పోయి దాన్ని పట్టుకోవాలని మనసులో ప్రాకులాడటం. ఇదికూడా ఒక పెద్ద అవివేకమే. ఎంచేతనంటే పరమార్థ మనేది ఎక్కడ పడితే అక్కడ ఉండే పదార్థం. ఎప్పుడు పడితే అప్పుడుండేది కూడా. దాని స్పర్శలేని దేశకాల వస్తువులంటూ ఏవీ లేవు. అలాంటప్పుడీ వ్యవహారమనేది జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమది ఎలా లేకపోతుంది. లేదంటే అది సర్వవ్యాపకమైన తత్త్వమే కాదు. అంతేగాక దానినెక్కడోపోయి చూడాలని ఎప్పుడో పోయి అందుకోవాలని భావిస్తే అది దాని గౌరవానికే లోపం. అప్పటికది జీవ చైతన్యంలాగా పరిచ్ఛిన్నమే గాని పరిపూర్ణం కాదని చాటినట్టవుతుంది. పరిపూర్ణం కానిది పరమార్థమని చెప్పి సుఖమేముంది. అప్పుడా మాట కసలర్థమే లేదు.

Page 73