అప్పుడిక వ్యావహారికమనే ప్రశ్నేముంది. అంతా పారమార్థికమే. ఈ పారమార్థికమనే దెప్పుడూ ఉన్నది. ఎప్పుడూ ఉన్నదే అయినా అది మన కిప్పట్లో అలా కనిపించటం లేదు. మీదు మిక్కిలి జీవజగత్తులనే రెండు భూమికలు ధరించి కనిపిస్తున్నది. కనిపిస్తున్నదంటే అది మన అజ్ఞానంవల్ల. ఈ అజ్ఞానం మనకుండటం మూలాన్నే తాత్కాలికంగా వాటికొక అస్తిత్వాన్ని కల్పించుకొని మనం వాటితో నిత్యమూ వ్యవహరిస్తున్నాము. వ్యవహరిస్తున్నాము గనుకనే ఆ మేరకు వ్యావహారిక సత్యమని ఒక పేరు పెట్టాము. అంత మాత్రమే.
అసలొక రహస్యమేమంటే వ్యావహారికంలో పారమార్థికముంది గాని పారమార్ధికంలో వ్యావహారికం లేదు. పారమార్థికమంటే బ్రహ్మ స్వరూపమే గదా. అది సర్వత్ర సర్వదా ఉండాలి కాబట్టి వ్యావహారిక దశలో కూడా ఉంటుందది. అయితే ఉన్నట్టు మనం గమనించటం లేదంత మాత్రమే. మనం గమనించకపోయినా దానిపాటికది ఎప్పుడూ ఉంది. అలా ఉంటేనే అసలది పారమార్ధిక మనిపించుకొనేది. పోతే వ్యావహారికమైన ఈ జగత్తు మాత్రం పారమార్థిక దశలోలేదు. ఉండటానికి సంభవం కూడా కాదు. ఉన్నదంటే అందులో భేదమనేది మనమొప్పుకోవలసి వస్తుంది. దానితో పారమార్థికం కదర్దితం Contaminated కాక తప్పదు. అయితే అప్పుడది పారమార్థికమే కాదు. ఈ సూక్ష్మాన్ని బాగా గమనించకనో గమనించి కూడా భేదవాసన అనేది వదలకనో పారమార్థికంలో కూడా వ్యావహారికాన్ని తెచ్చిపెడతారు ద్వైతవాదులు. అందుకే వారు మోక్షమనేది ఒక ఫలమనీ, దానినే వైకుంఠానికో కైలాసానికో పోయి మనమందుకోవలసి ఉంటుందనీ అది ఆ పరమాత్మే మనకు ప్రసాదించాలనీ కబుర్లు చెబుతుంటారు. పరమాత్మను కూడా తమ ఆత్మకన్నా విలక్షణమైన ఒక వ్యక్తి విశేషంగానే భావిస్తారు వారు. ఇలాంటి సిద్ధాంతాలు చేస్తున్నారంటే దేశకాల నామరూపాదుల సంపర్కం వీరినింకా వదలలేదనే మన మర్థం చేసుకోవచ్చు. అలా వదలకనే మోక్షదశలో కూడా ఇంకా వాటినే కలవరిస్తున్నారు. వైకుంఠం కైలాసమన్నారంటేనే అది ఒక దేశం. అప్పుడే అనుభవిస్తామంటే అది ఒక కాలం. మరి ఆ పరమాత్మకొక శరీరమనీ అవయవాలనీ వర్ణించామంటే అవి నామరూపాలే గాని వేరు గావు.
Page 72