#


Back

   మనమెక్కడ ఉన్నామని మనప్రక్కనే ఉన్న చెట్లూ చేమలడిగితే ఏమిటి జవాబు. వీటికన్నా విశిష్టులం మనమైతే మనకన్నా విశిష్టమా దేవజాతి కావచ్చు. జ్ఞానైశ్వర్యాలనే రెండు గుణాలవల్లనే విశిష్టత అనేది సిద్ధిస్తుంది. అవి అంతకంతకు తగ్గుతూ పోతే స్థావరాలకు దగ్గర పడతాము. హెచ్చుతూ పోతే దేవతలకు చేరువవుతాము. తగు మాత్రముంటే మానవుల మనిపించుకొంటాము. ఇందులో పయివారికి క్రిందివారి సంగతులర్థమవుతాయి గాని క్రింది వారికి పయివారి సంగతులే మాత్రమూ అంతుపట్టువు. పట్టక పోయేసరికదంతా అభావమని భావించటం మానవుడికి స్వభావం. కాని మనం భావించనంత మాత్రాన అవి లేకుండా పోవు. అన్నీ ఉండవలసిందే జీవుడు. జన్మాంతరాలున్నాయి లోకాంతరాలున్నాయి. ఆయా భూమికలలో సుఖదుఃఖాద్యను భవాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటీ ఉంది. ఏదీ లేకుండా పోదు. ఇదే శాస్త్రంలో పూర్వభాగమైన ధర్మపురుషార్ధం మనకు బోధించే విషయం.

   ప్రస్తుత మిదంతా వ్యావహారికంగా ఉందని అంగీకరించటం మూలాన లోకవ్యవస్థ మాదిరి శాస్త్రవ్యవస్థకు కూడా ఒక గతి కల్పించారు శంకరులు. అయితే ఇది కేవలం వ్యావహారికమే ననేమాట మరిచిపోవద్దని మనలను హెచ్చరిస్తారాయన. ఎంత మనం వన్నెచిన్నెలు పెట్టి వర్ణించినా ఇటు లోకవ్యవస్థా అటు శాస్త్రవ్యవస్థా రెండూ చివరకు వ్యావహారికమే Relative పారమార్ధికం Absolute కానేరదు. శాస్త్రంలో పూర్వభాగమైన ధర్మమే గాదు. ఆ మాటకు వస్తే ఉత్తరభాగమైన జ్ఞానం కూడా అంతేనని చాటారాయన. ఒక గురువనీ, శిష్యుడనీ, ఉపదేశమనీ, సాధన అనీ ఇది కూడా వ్యావహారికమే. సకల ప్రమాణాలూ, సమస్త వ్యవహారాలూ కూడా అవిద్యా క్షేత్రం యొక్క ఎల్లలు దాటిపోలేవని నిర్భయంగా చాటాడాయన లోకానికి. దీనిని బట్టి మనం గుర్తుంచుకోవలసిన రహస్యమేమంటే మానవుడజ్ఞాన మనేది సడలకుండా చూస్తున్నంత వరకే ఈ వ్యవహారమంతా. జ్ఞానోదయ మయిందంటే వీటికస లస్తిత్వమే లేదు. అంతా హుళక్కే. శాస్త్రమూ హుళక్కే లోకమూ హుళక్కే అంతా ఎగిరిపోతుంది. పోతే మనమింతవరకూ ఏ కరువు పెట్టిన ధర్మాధరాలు లేవు. జన్మాంతరాలు లేవు. లోకాంతరాలు లేవు. ఏదీ లేదు. ఎందువల్ల. జ్ఞానమంటే అంతా బ్రహ్మమనే నిశ్చయం కదా. అంతా బ్రహ్మమయినప్పుడిక అనేకత్వానికి చోటెక్కడిది. అనేకత్వం లేకపోతే దానిమీద ఆధారపడి బ్రతికే జీవజగత్తులు కూడా లేవు.

Page 71