#


Back

   కాబట్టి కర్మఫలమైన జన్మాంతరమెలా ఉందో - తత్పలభోక్త అయిన జీవుడు కూడా అలాగే ఉన్నాడు. మహా అయితే స్థూల శరీరంతో మనకు కనిపించడు స్థూలంతో లేకపోయినా సూక్ష్మశరీరంతో అదృష్టరూపంగా సంచరిస్తూనే ఉంటాడు గాని లేకుండా పోడు.

   పోతే జీవుడనీ, జన్మాంతరాలనీ, ఎప్పుడొప్పుకొన్నామో, అప్పుడిక లోకాంతరాలను కూడా ఒప్పుకోక తప్పదు. లోకమంటే ఏదో గాదు. జీవుడు తన కర్మఫలాన్ని అనుభవించవలసిన స్థానం. ఈ స్థానమిహమే కాక పరం కూడా కావచ్చు. కర్మఫలమంతా ఇహంలోనే తీరుతుందని చెప్పలేము. కొంత జన్మాంతరమెత్తి ఇహంలో అనుభవిస్తే మరికొంత అలా ఎత్తే ముందు పరలోకాల్లో అనుభవిస్తాము. అయితే ఈ పరమనేది మనకు ప్రత్యక్షం కాదే- ఇది ఉందా - అని లోకులకు సందేహం. అలా సందేహించనక్కర లేదన్నారు శంకర భగవత్పాదులు. 'జగద్వై చిత్ర్యోపలబ్దేః' అని ఆయన మాట. ఈ సృష్టి అనేది ఎంతో విచిత్ర Varied మైనది. అనంత Infinite మైనదీ. ఎక్కడ ఏది ఎంత మోతాదులో ఉందో నీకూ నాకూ అంతుపట్టే వ్యవహారం కాదు. అందులో మన గ్రాహితాకు వచ్చింది ఏ లేశమో అయితే రానిది ముప్పాతిక మువ్వీసం. అది మనకు దృగ్గోచరం కాలేదు గదా అని త్రోసి పుచ్చటం సాహస కార్యం.

   అలాగైతే మనచుట్టూ ఇప్పుడు స్థావర జంగమాత్మకమైన సృష్టి ఎంతో ఉన్నది. చెట్లూ చేమలూ, పశువులూ, పక్షులూ ఇవన్నీ మనతో పాటు బ్రతుకుతూనే ఉన్నాయి. కాని ప్రక్కనే ఉన్న మన విషయం వాటికేమైనా అవగతమవుతున్నదా. తరులతా గుల్మాదులకైతే మన వృత్తాంతం బొత్తిగా తెలియదు. జంతువులకు కొంత తెలిసినా అది ఒక తెలివి గాదు. అయితే వాటికి మనలను గూర్చిన ప్రజ్ఞ లేదు గదా అని మన మీ ప్రపంచంలో లేకుండా పోయామా. అవి గ్రహించినా గ్రహించకపోయినా మన మనుగడ మనకు సాగుతూనే ఉన్నది గదా. అలాగే మనం గ్రహించకపోయినా మన కతీతమైన సృష్టి కూడా ఎంతగానో ఉండవచ్చు. ఎక్కడ ఏదీ లేదని ఎలా శాసించగలం. ఈ అనంత విశ్వంలో ఎక్కడ ఏమున్నదో ఎవరికి తెలుసు. ఈ లోకమున్నట్లే దీనికతీతమైన ఆ లోకాలూ ఉండవచ్చు. ఈ లోకంలో మనమున్నట్లే ఆయా లోకవాసులూ ఉండవచ్చు. వారినే దేవతలని పేర్కొన్నారేమో మనవారు. వారెక్కడ ఉన్నారని ఆక్షేపించటం పొరబాటు.

Page 70