#


Back

   అలా నడిచిన నాడిక ఏ మానవుడు గానీ ఏ ప్రయత్నమూ చేయనక్కరలేదు. చేయకున్నా ఫలించవచ్చు. చేసినా నశించవచ్చు. దానితో పురుషార్ధ సిద్ధి కాస్కారమ లేదు. లేకుంటే విధి నిషేధాత్మకమైన శాస్త్రమిక దేనికి. ఎవరి కోసం. అది మొదటికే మోసం. కాబట్టి కార్యకారణ సంబంధమనేది ఒప్పుకోక తప్పదు. కాగా ఈ కార్యకారణాలనేవి ప్రతి ఒక్కటీ ఈ జన్మలోనే మనకు దృష్టమైతే ఫరవాలేదు. కాని అన్నీ అలా దృష్టం కావు. కావు గనుకనే పూర్వోత్తర జన్మలున్నాయని తీర్మానించవలసి వస్తుంది. కార్యం మాత్రమే కనిపించి కారణం కనిపించకపోతే పూర్వజన్మ. కారణం కనిపిస్తూ దానికి తగిన కార్యం కనిపించకపోతే ఉత్తరజన్మ. ఇలా ఒక జన్మకు మరొక జన్మ నిమిత్తమవుతూ పోతే అది తప్పకుండా జన్మ పరంపరకు దారి తీస్తుంది. కర్మ ఉన్నప్పుడు జన్మ ఉండక ఏమవుతుంది. కర్మఫలమ గదా జన్మ అంటే. కాబట్టి జన్మాంతర ముందనే విషయం ప్రత్యక్షానుమానాలను బట్టే తెలుసుకోవచ్చు మనం.

   జన్మాంతరమున్నదంటే మరణానంతరం జీవుడుకూడా ఉంటాడని ఒప్పినట్టే అవుతుంది. లేకపోతే శరీరం పతనమైన వెంటనే శరీరోపాధి అయిన జీవుడికిక అస్తిత్వం లేదు. జీవుడే లేకపోతే మరలా జన్మ ఎత్తవలసిందెవరు. అందులో ఈ కర్మఫలం అనుభవించవలసిందెవరు. కర్తా, భోక్తా అని గదా జీవుణ్ణి పేర్కొన్నాము. కర్తృత్వమున్నప్పుడు భోక్తృత్వం కూడా ఉండవలసిందే. కర్తృత్వమున్నందువల్ల కర్మ చేస్తాడు జీవుడు. కర్మ అనేది ఒక స్పందం Action. ప్రతి స్పందానికీ ఒక ప్రతి స్పంద Reaction ముండి తీరుతుంది. అది ఎక్కడిది మనకు దృష్టం కాలేదే అని వాదించరాదు. దృష్టం కాదు. గనుకనే దాని నదృష్టమని పేర్కొనటం. ఆకాశగుణమైన శబ్దం మనకెప్పుడంటే అప్పుడభివ్యక్తం Manifest కాదు. అయినా అది ఎప్పుడూ దానిలో అంతర్లీనంగా ఉందనే విశ్వసిస్తున్నాము గదా. అలాగే దీనిని విశ్వసించాలి మనం. అయితే ఎంతవరకంటే ఇది నాది. నేనుచేశాను. అనే అభిమానబుద్ధి Sense of Identity లేనంతవరకూ అది మనలనేమీ చేయలేదు. ఎలా పుడుతుందో అలా తొలగిపోతుంది. అలాకాక “నేను-నాది" అని ఎప్పుడు దానితో మనం తాదాత్మ్యం Identity చెందుతామో అప్పుడది మనపాలబడుతుంది. పడిందో అది మనమికెప్పుడో ఒకప్పుడనుభవించక తప్పదు. మరి అనుభవమనే సరి కనుభవిత Experiencer కూడా ఉండి తీరాలి గదా. ఆ అనుభవితే జీవుడు.

Page 69