#


Back

   శరీరమే పతనమైతే ఇక జీవుడెలా వెళ్ళగలడని ప్రశ్న రావచ్చు. స్థూలం పోయినా సూక్ష్మమనే దొకటి ఉందని మనం మరిచిపోరాదు. ఈ సూక్ష్మంలో కూచొని ప్రయాణం చేస్తాడు జీవుడు. ఇది చాలా సూక్ష్మమూ స్వచ్ఛమూ కాబట్టి తద్ద్వారా జీవుడు నిష్క్రమిస్తున్నా మన కంటికే మాత్రమూ కనిపించడు. జీవుడు నిష్క్రమిస్తుంటే జీవుడితో పాటు అతడు చేసుకొన్న పుణ్యాపుణ్య సంస్కారాలు కూడా అదృష్టరూపంగా అతణ్ని అనుసరించి వెళ్ళుతాయి. అవి ఈ జీవుణ్ని లోకాంతరాలకు చేరుస్తాయి. పుణ్యం చేసి ఉంటే స్వర్గాదులకు పోయి అక్కడ పుణ్యఫలమనుభవిస్తాడు. లేక పాపమే చేసి ఉంటే సరాసరి నరకానికి వెళ్ళి అక్కడ రౌరవాది నరకయాతనలనుభవిస్తాడు. మొత్తం మీద లోకాంతర యానమనేది తప్పదు జీవుడికి. ఇలా కర్మఫల మక్కడ అనుభవించిన తరువాత కర్మ ఫలశేషమనేది ఇంకా ఉంటుంది కాబట్టి మరలా వచ్చి ఈ కర్మ భూమి జన్మిస్తాడు. ఈ జన్మకూడా ఎక్కడ రావాలో ఎలాంటిది రావాలో అంతా ఆ కర్మనుబట్టే నిర్ణయమవుతుంది. ఇంతకూ కర్మనుబట్టి జన్మ, జన్మను బట్టి కర్మ. ఇది ఒక విషవలయం. తీరేది తీరతుంటే మరలా చేసేది చేస్తుంటాడు. కాబట్టి జన్మ పరంపర అనేది తప్పదు మానవుడికి. ఇదీ శాస్త్రం మనకు బోధించే విషయం.

   శాస్త్రం చెబుతుందనే గాక ప్రత్యక్షాది ప్రమాణాలకు గూడా ఇది సరిపడే విషయమనే చెబుతారు శంకర భగవత్పాదులు. అది ఎలాగంటే ఈ సృష్టిలో మనకెంతో వైషమ్యము, వైవిధ్యమూ కనిపిస్తున్నది. పుణ్యాత్ములెందరో కష్టాలనుభవిస్తున్నారు. పాపాత్మలెందరో హాయిగా బ్రతికిపోతున్నారు. దీనికేమిటి కారణం. కారణం లేకుండా కార్యమనేది ఎప్పుడూ తటస్థించదు. అలాగే కార్యమనేది మనం చేస్తున్నామంటే దానికేదో ఒక కారణం లేకుండా పోదు. కార్యకారణ సంబంధమనేది అనివార్య మీ సృష్టిలో అలా కాకపోతే అకృతాభ్యాగమమూ, కృత విప్రణాశమూ అనే రెండు దోషాలకు మనం జవాబు చెప్పవలసి వస్తుందంటారు భాష్యకారులు. అకృతా భాగ్యమమంటే మనమెప్పుడూ చేయనిది వచ్చి నెత్తిన పడటం. కృత విప్రణాశమంటే మానవుడెంత ఘోర పాపం చేసినా అది మాఫీ అయిపోవటం. ఇంతకన్నా గొప్ప అన్యాయం లేదు. అలాగే అయితే ఈ సృష్టి అనేది ఒక పిచ్చివాడి చేతి రాయిలాగా ఎలా బడితే అలా నడుస్తుందని చెప్పినట్టవుతుంది.

Page 68