ఆ మాటకు వస్తే ఒక లౌకికమే గాదు. శాస్త్రీయమైన వ్యవహారం కూడా ఈ ప్రాతిపదిక మీదనే సమర్థిస్తూ వచ్చారాయన. శాస్త్రమంటే ఇక్కడ బ్రహ్మశాస్త్రం Philosophy కాదు. కర్మ శాస్త్రం Religion. దీనికే ధర్మమని మారుపేరు. ధర్మమనే సరికది ద్వైత ప్రపంచానికి సంబంధించి ఉంటుంది. ఒక కర్తా, ఒక క్రియా, దాని అనుష్ఠానమూ, తద్వారా కలిగే ఫలమూ, దాని అనుభవమూ ఈ కలాపమంతా ద్వైతమే గదా. ఇది కూడా మానవుడి అవిద్యను బట్టి ఏర్పడుతున్నదే. కాబట్టి అది ఉన్నంతవరకూ లోకవ్యవహారం మాదిరి సాగుతూ పోవలసిందే. అలా సాగేటంతవరకూ అదికూడా సత్యంకావలసిందేనని సమర్థిస్తారు జగద్గురువులు. కాకపోతే అపౌరుషేయమైన శాస్త్రంలో ఒక భాగం ప్రామాణికమయి మరొకటి కాదని చెప్పవలసి వస్తుంది. అది మన సంప్రదాయానికే ఒక పెద్ద గొడ్డలిపెట్టు. జగద్గురువుల స్థాయిలో ఉన్న వ్యక్తి సామాజికమైన విశ్వాసాన్ని ఎన్నటికీ పడగొట్టే ప్రయత్నం చేయరాదు. అంచేత పారమార్థికంగా కాకపోయినా వ్యావహారికంగా సత్యమని సమర్ధించి శాస్త్ర ప్రమేయమైన ధర్మ తత్త్వాన్ని కూడా లోకంలో నిలబెట్ట గలిగారాయన.
అయితే ఈ ధర్మమనే దేమిటి ? వానిని భగవత్పాదులెలా సమన్వయించారని మన మర్ధం చేసుకోవలసి ఉంది. మన మీ స్థూల శరీరంతో నిత్యమూ చేసుకొనే కర్మకే ధర్మమని పేరు. యావజ్జీవమూ మనమీ శరీరంతో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. చేసే ప్రతి పనీ కర్మే అయినా అది శాస్త్ర చోదితమైతేనే దానిని ధర్మమని పేర్కొన్నారు మన పెద్దలు. శాస్త్ర నిషిద్ధమైతే దాని నధర్మమన్నారు. వీటికే పుణ్య పాపాలని లోకంలో వ్యవహారం. ఇవి రెండూ ఎప్పుడూవృథా పోవు. చేసిన తరువాత వాటి ఫలం మనమెప్పటికైనా అనుభవించి తీరవలసిందే. ఎప్పటికప్పుడు గాలికి పోయేది గదా కర్మ దానికి ఫలితమేమిటని తేలికగా మాటాడరాదు. కర్మ అనేది గాలికి పోయినా దానివల్ల కలిగే సంస్కారం Impression మాత్రం మనలను విడిచిపెట్టదు. అంటి పట్టుకొనే ఉంటుంది. దీనికే మీ మాంసకులు అపూర్వమనీ అదృష్టమనీ పేర్లు పెట్టారు. అది రేపీ స్థూలశరీరం పతనమైన తరువాత జీవుణ్ని పరలోకాలకు తీసుకొని వెళ్ళుతుంది.
Page 67