#


Back

   ప్రమాణ సిద్ధమైన దసత్యమని ఎవరనగలరు. శంకరులు కూడా ఆ మేరకది సత్యమనే చాటుతున్నారు. అయితే వాటికన్నా అతీతమైన ప్రమాణంతో నిరూపిస్తే మాత్రమిది అసత్యమని తేలుతుందంటారాయన. ఆ అతీతమైన ప్రమాణమేమిటి. ఉపనిషచ్ఛాస్త్రం. దాని దృష్ట్యా పరీక్షిస్తే అంతకుముందు ప్రపంచ రూపంగా భాసించిందప్పుడు బ్రహ్మ రూపంగా దర్శనమిస్తుంది. దానితో ఇక లోక వ్యవహారమనే మాటకే ఆస్కారంలేదు. దానికి పూర్తిగా మనమప్పుడు తిలాంజలి ఇవ్వవలసి వస్తుంది.

   అయితే మనమలా చూచినప్పటి మాట అది అంతవరకూ అవిద్యా దోషం మనలనింకా అంటిపట్టుకొనే ఉంటుంది. కాబట్టి ప్రత్యక్ష గోచరమైన వ్యవహారాన్ని గోచరించే వరకైనా ఒప్పుకోక తప్పదు. గోచరమవుతున్నా లేదు పొమ్మంటే అది పొరబాటు. అలా అన్నవారే విజ్ఞానవాదులైన బౌద్ధులు. అద్వైతులలా అనరు. ప్రపంచ మెంతెంత గోచరిస్తుంటే అంతంత ఉన్నదంటారు. గోచరించటం మానినప్పుడే లేదంటారు. “యావత్తావ దభ్యుపగమ్యతే” “యథా దృష్టమ్ గృహ్యతే" అని ఇలా ఎన్నో చోట్ల తమ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తారు భాష్యకారులు. రజ్జువును సర్పంగా చూచినంత దనుకా సర్పమనేది ఉంది గదా. దానివల్ల కలిగే భయకంపాదులు కూడా ఉన్నవే గదా. అలాగే అంతా బ్రహ్మమనే ప్రబోధ కలిగేంత వరకూ ఈ ప్రపంచం కూడా ఉండక తప్పదు. ఆ తరువాత నీ వుండమన్నా ఉండదది. అప్రయత్నంగానే తొలగిపోతుంది. ప్రతిదినమూ మనం చూచే స్వప్నమే దీనికి మంచి నిదర్శనమన్నారు. భగవత్పాదులు. స్వప్నంలో మనమెన్నో దృశ్యాలు ప్రత్యక్షంగా చూచినట్టే చూస్తుంటాము అవన్నీ మనకప్పటి కప్పుడెంతో యదార్థంగానే భాసిస్తుంటాయి. అసత్యమనే భావన ఏ మాత్రమూ మనసుకురాదు. అలా చూస్తున్నంతసేపూ అది సత్యమే. కాని ఉన్నట్టుండి మెళకువ వస్తే చాలు. మరుక్షణమే మటుమాయమై అంతా అసత్యని తేలిపోతుంది. అయితే మెళకువ అనేది రావాలి ఇంతకూ వచ్చేంతవరకూ తాత్కాలికంగానైనా అది సత్యమే. అలాగే ఈ లోక వ్యవహారం కూడా మానవుడి కాత్మ ప్రబోధం కలిగేంత వరకూ సత్యమే. ఆ తరువాతనే ఇది అసత్యం. అప్పుడు కూడా అందరికీ గాదు. ఎవడికి ప్రబోధం కలిగితే వాడికే. మిగతా వాళ్ళకంతా మరలా సత్యమే. ప్రబోధం కలిగిన వాళ్ళెందరుంటారు. నూటికి కోటికొక్కడుంటే ఎక్కువ. కాబట్టి ప్రవాహన్యాయంగా ఎప్పుడూ ఉంటుందీ ప్రపంచం. ఈ రూపంగా లౌకికమైన వ్యవహారాన్ని ఎప్పుడూ సమర్ధిస్తూనే పోతారు భగవత్పాదులు.

Page 66