#


Back

   దీనిని బట్టి అవిద్య ఉన్న దశ ఒకటీ అది లేని దశ ఒకటీ రెండు దశల నొప్పుకోవలసి వస్తున్నది మనం. ఈ అవిద్యాదశనే వ్యావహారికమనీ, విద్యాదశనే పారమార్థికమనీ పేర్కొన్నారు భగవత్పాదులు. ఇలా ఈ రెండు దశల నంగీకరించటం మూలంగా ఆయన ఎన్నో గడ్డయిన సమస్యలను పరిష్కరించగలిగారు. అన్నిటిలో ప్రధానమైన దిటు లోకానికీ - అటు శాస్త్రానికీ రాజీ కుదర్చటం. శాస్త్రమున్నదంతా బ్రహ్మమే మరేదీ లేదని చాటుతుంది. కాని మన లోకానుభవం దానికి పూర్తిగా విరుద్దంగా కనిపిస్తుంది రెంటికీ లంగరందటమెలాగ. ఆచార్యులవారు కనిపెట్టిన ఈ గురుకీలకమైతే రెంటినీ సరిపెట్టగలదు. ఎలాగ అని అడగవచ్చు. భేదమనేది పారమార్థికంగా కాకపోయినా వ్యావహారికంగా అంగీకరిస్తున్నాము గదా. అంచేత ఆ మేరకు లోక వ్యవహారానికేమీ ఆటంకం లేదు. యథేచ్ఛగా సాగవచ్చు. దైనంది నానుభవానికి విరుద్ధంగా పోవలసిన ప్రమేయం లేదు. మీదు మిక్కిలి దాని నామోదించినట్టవుతుంది. అలాగే వ్యావహారికంగా ఎంత భేదం కనిపిస్తున్నా అది ఆ కనిపించే మేరకే గాని లోతుకు దిగి చూస్తే మరలా అది హుళక్కే. పారమార్థికంగా ఏదీ లేదక్కడ. మృగతృష్టికలో నీరు దూరానికి కనిపించినా దగ్గరికి వెళ్ళి చూస్తే వట్టిదే గదా. అలాగే ఇదీ వట్టిద. కాబట్టి సర్వమూ బ్రహ్మమేనని చాటే శాస్త్ర వచనానికీ తిరుగులేదు. ఈ ప్రకారంగా ఒకవైపు మానవుడి లోకానుభవాన్నీ మరొకవైపు శాస్త్ర సిద్ధాంతాన్నీ రెండింటినీ సమర్ధించగలిగారు భగవత్పాదులు. ఇది రెండందాలా పదునైన కత్తిలాంటిది. అద్వైత వేదాంతం గనుకనే ఇలాంటి సమన్వయం సాధ్యం కాగలిగింది. మరొక దర్శనంలో దీనికి పరిష్కారమే లేదు.

   ఇది అర్థంగాక చాలామంది లోకంలో శంకరుని అద్వైతమే ఒప్పుకొంటే కొంప మునుగుతుంది. లోకానుభవానికే స్వస్తి చెప్పవలసి వస్తుందని వాదిస్తారు. అది కేవలం వారి అవిచార మూలకమేగాని మరేమీ గాదు. అద్వైత మొప్పుకొన్న మాత్రాన లోకవృత్తానికెప్పుడూ ముప్పులేదు. లోకమంటే ఏమిటది. ప్రత్యక్షానుమానాలకు గోచరమయ్యేదే గదా. ప్రత్యక్ష అనుమానాలంటే ఏమిటవి. ప్రమాణాలు.

Page 65