#


Back

   ఆ కారణాని కవ్యక్తమూ, అవ్యాకృతమూ Unmanifest matter అని పేరు. సూక్ష్మానికి సూత్రమని పేరు. పోతే స్థూలానికి విరాట్టని పేరు. ఇవి మూడూ చైతన్యాని కక్కడా ఉపాధులే. వీటిచేత ఉపహితమైన ఆ చైతన్యాన్ని వరుసగా ఈశ్వరుడనీ, హిరణ్యగర్భుడనీ, వైశ్వానరుడనీ వ్యవహరిస్తారు. వీరు ముగ్గురూ పిండాండోపహితులైన ప్రాజ్ఞతైజస విశ్వులనే జీవులకు సహ యాత్రికులు. అయితే విశేషమేమంటే వీరికున్న ఉపాధి సాత్త్వికోపాధికాబట్టి దానికి వారధీనం కారు. మీదు మిక్కిలి అదే వారికి వశవర్తి అయి ఉంటుంది. పోతే మనబోటి జీవుల విషయమలాంటిది కాదు. మనది రాను రాను రజస్తమస్సులతో మలినమైన ఉపాధి కనుక దానికి మనమంతా అంతకంతకు బందీ అయిపోయాము. తత్కారణంగా వారు దేవతలైతే, మనం మానవులమైతే, మనకన్నా తగ్గు జాతివి పశుపక్ష్యాదు లయ్యాయి. ఇదంతా అవిద్యా పిశాచి విలయ తాండవ వినోదఫలమే.

   మొత్తానికి చుట్టూ ప్రదక్షిణం చేసి అక్కడికే వచ్చాము మరలా అన్నింటికీ మూలకారణ మవిద్యేగాని మరొకటేదీ గాదు. పోతే ఈ అవిద్య అనేదేమిటింతకూ. విద్యమానం Existant కానిదేదో అది అవిద్య అన్నారు. ఎక్కడాలేని పదార్ధమది. ఎందుకంటే అది వస్తువుగాదు. వస్తువనేది బ్రహ్మ చైతన్య Supreme conscience మొక్కటే. ఉండేదేదో అదిగదా వస్తువంటే ఉండేది ఎప్పుడూ చైతన్యమే. మిగతాది ఇక ఏదైనా దాని ఆభాసమే Appearance గాని వస్తువు Reality గాదు. అంటే వస్తువులాగా భాసిస్తుందే గాని విచారిస్తే ఏమీ ఉండబోదు. ఇలాంటి ఏమీలేని పదార్ధమే అవిద్య అనేది. అదే అసత్యమయినప్పుడిక దాని సంతానమైన ఈ జీవజగత్తులు మాత్రం సత్యమెలా అవుతాయి. అవిద్య రంగంలో ఉన్నంతవరకే ఇవి ఇలా కనిపిస్తుంటాయి. అది ఎప్పుడు తెర మరగవుతుందో ఇవీ అప్పుడే ఒక స్వప్నంలాగా కరిగిపోతాయి. అయితే అది ఎప్పుడు తొలగుతుందా అవిద్య. విద్య ఎప్పుడుదయిస్తుందో అప్పుడు దానిపాటికదే తొలగిపోతుంది. సూర్యోదయంకాగానే అంధకారం తొలగటం లేదా. అలాగే ఈ అవిద్య అనే అంధకారం కూడా. అప్పుడిక జీవుడూ లేడు - జగత్తూ లేదు. అంతా కలిసి అలికినట్టు ఒకే చైతన్య రూపంగా అనుభవానికి వస్తుంది.

Page 64