అందులో చేతనుడైన జీవుడికీ జగత్తులోని పదార్ధాల ననుభవించాలనే కామమేర్పడింది. కామమనేది అమూర్తమైన ఒక భావం. కాబట్టి దానికి సూక్ష్మ శరీరమని పేరు పెట్టటం సమంజసమే. ఇది కూడా అవిద్యలాగా చైతన్యాన్ని మరుగు పరిచేదే కాబట్టి శరీరమయింది. దీనిలో మనస్సూ, ప్రాణమూ అనేవి రెండు ప్రధానమైన పరికరాలు. వీటిలో ప్రాణంవల్ల జీవుడు కర్త అయితే మనస్సువల్ల భోక్త అవుతున్నాడు. ఈ కర్తృత్వ భోక్తృత్వాలే Planning and Execution అసలు జీవుడి స్వరూపం. ఒకటి కార్యాన్ని నిర్వర్తించటం. మరొకటి దాని ఫలాన్ని అనుభవించటం. ఇంతకన్నా జీవుడికి జీవనమంటూ మరొకటి లేదు. రెండింటికీ మనః ప్రాణాలే ఆలంబనమని చెప్పాము. వీటి మూలంగానే జీవుడికీ లోకంతో నిత్యమూ లావాదేవీ. రెండింటికీ కామమనేదే ప్రేరణశక్తి Impulse కామోపహతుడైన జీవుణ్ణి గుర్తు పట్టాలంటే అతడి దూతలీ మనః ప్రాణాలే గదా. కనుకనే జీవోపాధులైన వీటి రెండింటికీ కలిసి లింగ శరీరమని కూడా నామాంతరం. దాగి ఉన్న భావాన్ని సూచించేదేదో అదే లింగం.
పోతే ఈ సూక్ష్మమూ లేదా లింగ శరీరమనేది మరో మూడో శరీరం కూడా అవతరించటానికి హేతువయింది. అదే మనకు కనిపించే ఈ స్థూల శరీరం Gross Body కర్మ ప్రధానమైనదిది. అవిద్య కామాన్ని సృష్టిస్తే కామంకర్మ నుత్పాదిస్తుంది. ఒక విషయాన్ని కామించినప్పుడా కామాని కనుగుణంగా దానిని పొందే ప్రయత్నం చేయటం కూడా సహజమే. ఇలాంటి ప్రయత్నమే కర్మ. ఈ కర్మ అనేది మరలా రెండు విధాలు. ఒకటి చేయటమైతే, మరొకటి అనుభవించటం. రెంటికీ మనః ప్రాణాలే గదా ఆలంబనమని చెప్పాము. కాబట్టి ప్రతి ఒక్క పనీ మనః ప్రాణాలవల్లనే జరగవలసి ఉన్నది. మరి ఈ మనః ప్రాణాలనేవి అధికారులవంటివి. సొంతంగా అన్ని పనులూ చేసుకోలేవు. వాటి క్రింద పనులు చేయటానికి కొందరు నౌకర్లు కావలసి ఉంది. అవే ఇంద్రియాలు. ఇందులో మనసు క్రింద పని చేసేవి చక్షురాదులైన జ్ఞానేంద్రియాలైతే ప్రాణం క్రింద చేసేవి పాణిపాదాదులైన కర్మేంద్రియాలు. ఇవన్నీ అమూర్తమైన శక్తి విశేషాలు కాబట్టి ఎక్కడో గాలిలో ఉండే వ్యవహారం కాదు. అన్నింటికీ కలిసి మూర్తమైన ఒక అధిష్ఠానం Basis ఎంతైనా అవసరం.
Page 62