అయితే ఈ అజ్ఞానమనేదేమిటి? అది ఎక్కడిది? అని ఇప్పుడు ప్రశ్న. ఈ ప్రశ్న అడగవద్దన్నారు శంకర భగవత్పాదులు. ఎందుకని. అజ్ఞానమనేది వదలకుండానే అడుగుతున్నావు నీవా ప్రశ్న. అజ్ఞాన వలయంలోనే తిరుగుతూ ఈ అజ్ఞానమనే దేమిటని అడిగితే ప్రయోజనమేముంది. పైగా అది ఏమిటని అడిగే అవకాశం కూడా లేదు నీకు. అజ్ఞానమేమిటని అడగాలంటే జ్ఞానంతోనే గదా అడగాలి నీవు. జ్ఞానంతో అడగాలంటే ఇక అజ్ఞానమేమిటి నీ ముఖం. అది జ్ఞానమే అవుతుంది. కరదీపిక చేత బుచ్చుకొని కటికి చీకటి నన్వేషిస్తే అది మనకు కనిపిస్తుందా పెడుతుందా. ఆ దీపకాంతిలోనే అది లీనమయిపోతుంది. అలాగే అజ్ఞానమనేదేమిటి ఎక్కడిది అని ప్రశ్నిస్తే చివరకు జ్ఞానమే అవుతుందది. జ్ఞానం లేకపోవటమే అసలజ్ఞాన మంటే. అది ఒక పదార్ధంగా ఎక్కడా లేదు. జ్ఞానం లేనంతవరకూ ఉన్నట్టు భాసిస్తుంది. అది ఉదయించిందంటే తొలగిపోతుంది. అప్పుడీ అజ్ఞానమనే దంతకు ముందూలే-దప్పుడూలే-దెప్పుడూ లేదని గ్రహించగలడు మానవుడు. ఇంతకూ మనకు జ్ఞానం కలిగేవరకు అదేమిటి? ఎందుకు? అని ప్రశ్న వేసినా సుఖం లేదు. కలిగిన తరువాత ఇక ప్రశ్న వేయనే అక్కరలేదు. అంచేత దాన్ని గూర్చిన చర్చే మన కనవసరం పొమ్మంటారాయన.
పోనీ ఏమిటనే ప్రశ్న వద్దు మనకు. ఎప్పటి నుంచీ ఏర్పడిందని అయినా అడగవచ్చునా అంటే అదీ పనికి రాని ప్రశ్నేనన్నారు. ఎందుకంటే అజ్ఞానమనేది ఎప్పుడూ లేదని నిర్ధారణ అయినప్పుడది ఇక ఎప్పటి నుండి అని ప్రశ్నేముంది. అంతమేగాని ఆది లేదు దానికి. జ్ఞానముదయిస్తే అంతమవుతుందది. అలా అంతమయ్యేదాకా ఉంటూనే ఉందది. ఎప్పటి నుంచీ అంటావేమో. ఎప్పటి నుంచీ నీకు జ్ఞానం లేదో అప్పటి నుంచే ఎప్పటి నుంచీ లేదు జ్ఞానం అని అడిగితే అంతకన్నా హాస్యాస్పదం లేదు. జ్ఞానమనేది ఇక మీదట మనకు కలగవలసింది. అది ఇంతకు ముందెలా ఉంటుంది. ఉంటే ఇక అజ్ఞానమెక్కడిది. కాబట్టి ఇంతకు ముందున్నదంతా మన కజ్ఞానమే. అది ఇప్పుడున్నట్టు మన కనుభవ సిద్ధమే గదా. ఇప్పుడున్నదంటే ఇంతకు ముందు కూడా ఉన్నదని చెప్పనక్కరలేదు.
Page 60