#


Back

   అయితే దీనిపైన కూడా ఒక ఆక్షేపణ వస్తుంది. అదేమిటంటే ఇంద్రజాలంలో కనుకట్టనేది ప్రేక్షకులు కొనితెచ్చుకొన్నది గాదు. అది కూడా ఆ ఐంద్ర జాలికుడు బలవంతంగా వారిమీద పడవేసిందే. కనుకనే వాడు కల్పించిన కనుకట్టున్నంత వరకూ ప్రదర్శన చూస్తారు. అది ఉపసంహరిస్తేచూడటం మానివేస్తారు. ప్రేక్షకుల తప్పేమీ లేదక్కడ. అంతా ఆ ఐంద్రజాలికుడిదే. వాడు చూపితేనే గదా వీరు చూస్తున్నారు. అలాగే ఈశ్వరుడే ఐంద్రజాలికుడన్నప్పుడిక్కడ కూడా ఆ ఈశ్వరుడిదే కావాలి అపరాధమంతా. ఆయన చూపకుంటే సృష్టి ఎక్కడిది. ఆయన ఇవ్వకుంటే మనకు దానిని చూచే దృష్టి ఎక్కడిది. కాబట్టి మీరెంత మనోహరంగా వర్ణించినా ఈ దృష్టాంతం మన సమస్యకు పరిష్కారం కాదనటం స్పష్టం.

   దీనికి శంకరులిచ్చే సమాధానమేమంటే దృష్టాంతమనే దాన్ని మనం తెగేదాకా బిగించరాదు. ఒక విషయం బొత్తిగా అర్ధం కాకపోతే దాన్ని సులభంగా బోధించడానికి శాస్త్రం మనకొక దృష్టాంతాన్ని That which illustrates చెబుతుంది. అది ప్రతి ఒక్క అంశంలోనూ దార్థాంతికంతో That which is illustrated సరితూగాలని నియమంలేదు. వివక్షితమైన అంశమేదో దానితో సరిపోలితే చాలు. మిగతా అంశాలలో తేడా ఉన్నా ఫరవాలేదు. అలాకాక నూటికి నూరుపాళ్ళూ సరిపడాలని పట్టుపడితే ఇక అది దృష్టాంతమే కాదు దార్జంతికమే అయి కూచుంటుంది. అది మొదటికే మోసం. కాబట్టి ఐంద్రజాలికుడి దృష్టాంతాన్ని కూడా కొంతవరకే తీసుకోవాలి మనం. వస్తు స్వభావమే కాకుండా మానవుడి దృష్టి దోషం కూడా కారణమని చెప్పటమే దాని ఆశయం. అంతకుమించి ఈ దృష్టి దోషానికి కూడా సబబేమిటని ప్రశ్నిస్తే ఇక దృష్టాంతం పరిధినే దాటిపోవలసి వస్తుంది మనం.

   అలా దాటిపోయి చూచామంటే మనకొక నమ్మశక్యం గాని నిజం బయట పడుతుంది. అదేమిటంటే ఇంద్రజాలంలో ఐంద్రజాలికుడనేవాడు ప్రేక్షకులకు భిన్నంగా ఒకడున్నాడు. ప్రేక్షకులే ఐంద్రజాలికుడు కాదు. కాదు గనుకనే వాడు తన శక్తితో వారిపైన కనుకట్టు ప్రయోగించే అవకాశమేర్పడింది. పోతే ప్రస్తుత విషయమలాంటిది కాదు. అసలిక్కడ జీవుడి కంటే విలక్షణంగా ఈశ్వరుడనే వాడెక్కడా లేడు. జీవుడి స్వరూపమే ఈశ్వరుడు. మనలో ఉండే ఆత్మే Indi-self గదా బ్రహ్మ Uni-self మని పేర్కొన్నాము.

Page 58