#


Back

   దీనిని బట్టి మనమర్ధం చేసుకోవలసిందేమంటే ఆ ఈశ్వరుడికి కూడా చిత్ర విచిత్రంగా పరిణమించే స్వభావమెంత ఉన్నా తనపాటికి తానెప్పటికీ మారబోడు. ఎందుకంటే స్వభావమొక్కటే చాలదలా మారటానికి. మరొక నిమిత్తం కూడా దానికి జతపడాలని చెప్పాము. మరి ఆ నిమిత్తమేమిటని అడగవచ్చు. అది ఏదో గాదు. మనందరికీ అంటిపట్టుకొని ఉన్న అజ్ఞానమే. మనకున్న ఈ అజ్ఞానమనేది నిమిత్తంగా చేసుకొనే ఆ పరమేశ్వరుడీ సృష్టి అనే నాటకాన్ని ఇలా ప్రదర్శిస్తున్నాడు. మరో మాటలో చెబితే మానవుడజ్ఞాన దృష్టిలో చూస్తుంటే ఈ సృష్టి ఇలా చిత్ర విచిత్రంగా భాసిస్తున్నది.

   దీనికొక అద్భుతమైన దృష్టాంతాన్ని మనకు వర్ణించి చెబుతారు భగవత్పాదులు. మనదేశంలో ఇంతకు పూర్వమింద్రజాలమనే విద్య ఒకటి బాగా ప్రచారంలో ఉండేది. అందులో రజ్జుక్రీడ Rope-Trick అనేది ఒక భాగం. ఒక లావుపాటిమోకు నాకాశంలోకి విసరి ఐంద్రజాలికుడొకడు దానిని పట్టుకొని ప్రాకిపోతాడు. చూపుమేర దూరం దాటిపోయి కొంతసేపటికి వాడు తన పరికరాలతో సహా చెక్కలు ముక్కలై క్రిందబడతాడు. అలాపడి మరలా కొంతసేపయిన తరువాత యథాపూర్వంగా లేచి నిలబడతాడు. ఇలాంటిదీ వాడు ప్రదర్శించే విద్య.

   ఈ విద్య నెన్నిమార్లు తిలకించారో ఆ పరమహంస పరివ్రాజకులు. ఎక్కడ బడితే అక్కడ తన భాష్యంలో దాని నుదాహరిస్తారు. అందులోనూ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రహస్యాన్ని తద్వారా బయటపెడతారు. ప్రస్తుతాంశానికి సంబంధించిన అలాంటి రహస్యమేమిటో ఇప్పుడు పరిశీలిద్దాము. ఈశ్వరుడనేవాడొక ఐంద్రజాలికుని వంటివాడు. వాడాకాశంలోకి విసరిన మోకులాంటిదీ సృష్టి అంతా. దీనినెప్పుడూ విడవకుండా గ్రుడ్లప్పగించి చూచే ప్రేక్షకుల లాంటివారే మనబోటి జీవకోటులన్నీ. పోతే అక్కడ ప్రేక్షకుల మీద కనికట్టనేది పనిచేసినట్టే మనమీద కూడా ప్రస్తుత మజ్ఞానమనేది పనిచేస్తున్నది. ఐంద్రజాలికుడి శక్తీ, ప్రేక్షకుల కనుకట్టూ రెండూ కలిసి కారణాలక్కడ. ఏది లేకున్నా ప్రదర్శన నిలిచిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఈశ్వరుడి మాయాశక్తికి మనబోటి జీవుల అజ్ఞానం తోడవుతున్నది. మన అజ్ఞానమే షరీకు గాకపోతే సృష్టి అనే ప్రసక్తే లేదు. కనుకట్టే లేకపోతే గారిడీ ఎక్కడిది. అలాగే జైవమైన ఈ అజ్ఞానమే లేకపోతే ప్రపంచ సృష్టి అనేదే అబద్దమన్నారు భగవత్పాదులు.

Page 57