ఏవం విధమైన రాగద్వేషాలకు గురి అయిన వాడస లీశ్వరుడెలా అవుతాడు. వాడూ మనలాంటి ఒక జీవుడే కావలసి వస్తుంది. మహా అయితే జీవులలోనే సర్వశక్తులూ అలవడిన ఒక పెద్ద జీవుడంత మాత్రమే. అని ఒక పెద్ద ఆక్షేపణ.
ఈ ఆక్షేపణకు శంకర భగవత్పాదులు చెప్పే సమాధానమిది. సృష్టిలో వైషమ్య నైర్ఘృణ్యాలున్నాయనే మాట వాస్తవమే. ఈ సృష్టి చేసిన వాడా పరమేశ్వరుడనే మాటకూడా వాస్తవమే. కానీ ఎంత వాస్తవమైనా తన పాటికి తాను నిరంకుశంగా సాగించలేదీ సృష్టి నా ఈశ్వరుడు. అలా నిర్నిమిత్తంగానే సాగించి ఉంటే దీని దోషమాయన మెడకు గట్టిగా చుట్టుకొనేదే సందేహం లేదు. కాని నిమిత్తమనే దొకటి ఉంది దీనికి. మనమింతకు పూర్వమొక విషయం చెప్పుకొన్నాము. ఎప్పుడైనా ఒక వస్తువు మరొక వస్తువుగా భాసిస్తుందంటే దానికి నిమిత్త మావస్తు స్వభావమేనని కేవల మా వస్తుస్వభావమే గాదు. ఆ మాటకు వస్తే దాని నలా దర్శించే మానవుడి దృష్టికూడా అందుకు నిమిత్తమే. రెండూ ఒసగూడినప్పుడే అలా భ్రమ పడటాని కాస్కార మేర్పడుతుంది. ఆ రెంటిలో ఏ ఒకటి లోపించినా అది సంభవం కాదు. ఇదీ మనం గ్రహించవలసిన రహస్యమిక్కడ.
ఇంతకు ముందిచ్చిన ఉదాహరణనే మరలా మనమిప్పుడు పరిశీలించి చూతము. త్రాడనేది పాముగా ఎందుకు భాసించింది. దానిలో పాము లక్షణాలు కొన్ని ఉండటంవల్లనని గదా పేర్కొన్నాము. అలాగే మనం దాన్ని పామని అపోహపడి చూడటంవల్ల కూడా అలా భాసించి ఉండవచ్చు. మనం చూడకపోతే లక్షణాలున్నా అది అలా భాసించబోదు. త్రాడు త్రాడుగానే కనిపించేది. ఇంతెందుకు. చీకట్లోపోయే ప్రతివాడికీ త్రాడు పాములాగా కనిపిస్తుందా. లేదు. ఎవడు పామని భ్రమిస్తే వాడికి మాత్రమే అలా భాసిస్తుంది. మిగతా వారందరికీ మరలా అది త్రాడే. కేవలమది వస్తుస్వభావమే అయితే అందరి దృష్టికీ ఒకలాగే భాసించాలి గదా. ఒకరికి పాముగా ఒకరికి త్రాడుగా ఎందుకు గోచరిస్తున్నది. కాబట్టి వస్తుస్వభావమనేది ఒక్కటేగాదు నిమిత్తం. వస్తు స్వభావమూ, మన అజ్ఞానమూ, రెండూ కలిసి నిమిత్తమవుతాయి. అలా కాకపోతే ఎంత మారే స్వభావమున్నా వస్తువు వస్తువుగానే ఉండిపోతుంది గాని మరొక వస్తువుగా మారిపోవలసిన అగత్యం లేదు దానికి.
Page 56