#


Back

   అన్నపానాది క్రియలున్నాయి. కానీ మనలాగా ఎక్కడికీ పోలేవవి. ఎవరు తమ్ము బాధించినా ఏమీ చేయలేవు. పోతే ఇక మనబోటి జంగమాలున్నాయి. వీటిలోనూ జరాయుజాలనీ, అండజాలనీ, స్వేదజాలనీ ఒకటిగాదు ఎన్నో జాతులు. ఒక్కొక్క జాతిలో అర్బుదన్యర్బుదాలు జీవరాసులు. అందులోనూ ఒకదానికి మరొక దానికి సంబంధమే లేదు. దేని శరీర నిర్మాణం దానిది. దేనిప్రవృత్తులు Tendencies దానివి. అంతా ఒక పారమేశ్వరమైన సృష్టి అయినప్పుడింత వైషమ్యమేర్పడటానికి నిమిత్తమేమిటి. ఇంత ఉచ్ఛావచంగా Ups & Downs సృష్టి జరిగిందంటే అది ఎంత వైషమ్యం.

   పోతే ఇక నైర్ఘృణ్యమనే దోషం. దాని కసలంతే లేదు సృష్టిలో. నైర్ఘృణ్యమంటే నిర్ఘృణత్వం లేదా నిర్దయ. కేవలం వైషమ్యం వరకే గాదు. దానితోపాటు దయా దాక్షిణ్యాలు కూడా లేవా పరమేశ్వరుడికి. లేకపోతే ఇంత విషమంగా సృష్టించి ప్రాణికోటి కిన్ని బాధలు తెచ్చిపెట్టడు. బాధపడని జీవే లేడు గదా సృష్టిలో. మనలాంటి మానవుల మాట అలా ఉంచి మూగజీవులైన పశుపాక్ష్యాదులమాట ఏమిటి. అంతకన్నా నికృష్టంగా బ్రతికే స్థావరాల పరిస్థితి ఏమిటి. ఒకదానికన్నా ఒకటి కన్నా కష్టంగా బ్రతుకుతున్నాయి. రోలు పోయి మద్దెలతో మొరపెట్టుకొన్నట్టు ఒకదాని వేదన నొకటి ఆర్చలేదు. తీర్చలేదు. 'శోచ్యఃకమను శోచసి' అన్నారు వ్యాసభగవానులు. నీవే శోచనీయుడవయి మరొకరికి శోకోప శమనం చేసేదేమిటి. మనకు కలిగే ఆ శోకమైనా ఒక రకం కాదు. మూడు రకాలు. ఆధిభౌతిక, మాధ్యాత్మిక, మాధిదైవికం. దీనికే తాపత్రయమని నామకరణం చేశారు. ఈ త్రయంలో ఏదో ఒకటి మనమీద దాడి చేయని క్షణమంటూ ఎప్పుడూ ఉండబోదు. ఈ త్రిపురాసురులు పెట్టే హింస ప్రతి ఒక్క ప్రాణీ భరించవలసిందే. తప్పటం లేదు.

   ఈ రీతిగా ఇంత విషమమూ, ఇంత నిరణమూ అయిన విధానంలో ఈ సృష్టి జరిగిందంటే దీనికంతటికీ ఎవడు బాధ్యుడు. సృష్టికర్త అయిన ఆ ఈశ్వరుడే గదా. మరి ఈశ్వరుడంటే పరిశుద్ధమూ, పరిపూర్ణమూ అయిన ఒకానొక తత్త్వమని గదా ప్రతిపాదించారు. పరిశుద్దమైతే దానికింత మంది ప్రాణుల నిలా నిష్కారణంగా బాధించాలనే కక్ష దేనికి. పరిపూర్ణమైతే అసలింతమంది ప్రాణులనింత ఉచ్చ నీచాత్మకంగా సృష్టించటం దేనికి.

Page 55