#


Back

   పైగా మరొక విశేషమేమంటే ఈశ్వరుడికున్న ఈ శక్తి మిగతా లౌకిక పదార్ధాలకుండే శక్తిలాంటిది కాదు. మృత్సువర్ణాది పదార్ధాలకు కూడా శక్తి ఉంది లోకంలో. దానితో అవి కటక కుండల కేయూరాదులైన ఆభరణ విశేషాలుగానూ మారిపోగలవు. కానీ వచ్చిన ఇబ్బంది ఏమంటే అలా మారిపోతున్నట్టు వాటికేమాత్రమూ గుర్తింపు లేదు. కారణం అవి కేవలమూ అచేతనమైన పదార్ధాలు కావటమే. మరి చేతనమైన జీవజాలం కూడా ఉంది ఈ లోకంలో. జరాయుజాదులైన ఈ జీవులకు కొంత శక్తి ఉన్నా అది ఉన్నట్టు వారు గమనించగలిగినా ఆ శక్తిఅనేది ఎంతోగాదు. అది ఆయా జీవులకు ప్రతినియతమూ Individually fixed పరిచ్ఛిన్నమూ Limitted అయి ఉంటుంది. కాబట్టి అదీ చెప్పుకోదగిన విషయం కాదు. పోతే ప్రస్తుతం మనం చెప్పుకొనే ఈశ్వరుడి విషయం అలాంటిది గాదు. ఈశ్వరుడు మృత్సువర్ణాదుల మాదిరి అచేతనుడు కాడు. చేతనుడైనా జీవుడి మాదిరి అపరిపూర్ణుడు కాడు. పరిపూర్ణ చేతను డాయన. ఆయన శక్తికూడా పరిపూర్ణమే. పరిపూర్ణమైన ఆ శక్తి Infinite power ఒకటి తన కధీనమై ఉన్నదని గుర్తించగలడు. దానిని వశీకరించుకొని చిత్ర విచిత్ర భూమికలు Forms ధరించినట్టు మరలా తాను అనుసంధానం చేసుకోనూ గలడు. మూడు దశలలోనూ బాహ్యమైన సామగ్రిని దేనినిగానీ అపేక్షించబోడు. అలాంటప్పుడా ఈశ్వరుడీ సృష్టినంతా అసహాయంగా నిర్వహించాడని చెప్పటంలో ఆశ్చర్యమేముంది. ఆయన మాయాశక్తి విలాస మలాంటిది. అదే ఈ చరాచర ప్రపంచాన్నంతటినీ ఒక చిత్రపటంలాగా తీర్చిదిద్దింది.

   అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మరలా మనం పొగలోనుంచి సెగలోవచ్చి పడ్డట్టయింది. సృష్టిని సమర్ధించబోయి మనం స్రష్టకే Creator ముప్పు తెచ్చిపెట్టాము. చరాచర సృష్టినంతా తన మాయాశక్తి సహాయంతో ఆ ఈశ్వరుడే గదా సృష్టించాడని పేర్కొన్నాము. అలాంటప్పుడీ సృష్టిలోని అవక తవకల కన్నింటికీ ఆయనే ఇక జవాబుదారీ వహించవలసి వస్తుంది. సృష్టిలో మనకు ముఖ్యంగా కనపడే అవక తవకలు రెండే. ఒకటి వైషమ్యమూ, మరొకటి నైర్ఘృణ్యమూ అన్నారు. బాదరాయణులు. వైషమ్యమంటే అన్నీ ఒక తీరుగా లేకపోవటం చూడండి. ఈ సృష్టిలో స్థావరాలూ, జంగమాలూ అని రెండు జాతులు. అందులో స్థావరాలైన వృక్షలతా గుల్మాదులు కదలలేవు, మెదలలేవు. వాటికీ మనలాగే ప్రాణముంది.

Page 54