#


Back

   కాబట్టి మనమలా చేయవలసి వచ్చిందంటే అప్పటి కావస్తు స్వభావంలోనే ఒకానొక దౌర్బల్యం ఉండి తీరాలని ప్రశ్న వస్తుంది.

   వాస్తవమే. వస్తు స్వభావంలోనే In its very nature ఉంది అలాంటి దోషం. సందేహం లేదు. దీనికొక దృష్టాంతం కూడా మనవి చేస్తాను. మనం చీకట్లో నడిచి పోతుంటే కొంతదూరాన మనకంటికొక తెల్లని పొడుగు పాటి పదార్ధంకనిపిస్తుంది. అది చూచి వెంటనే మనం పామని భయపడతాము. వాస్తవానికది పాము గాదు. త్రాడు. త్రాడు త్రాడు లాగా ఉండక పాములాగా ఎందుకు భాసించింది. అలా భాసించే స్వభావం దానికుండటం మూలాన్నే గదా. పాముకుండే లక్షణాలు కొన్ని త్రాడుకున్నాయి. సన్నగా తెల్లగా పొడుగ్గా ఉండటం పాముకుండే స్వభావం. అదే త్రాడుకూ ఉంది. అందుకే దీన్ని చూడగానే అది జ్ఞప్తికి వచ్చింది. ఇలాంటి జ్ఞప్తి మనకే పీటనో చేటనో చూస్తే రాదు. త్రాటిని చూచినప్పుడే వస్తున్నది. అలా వస్తున్నదంటే ఏమిటి దానికి నిమిత్తం. త్రాడులో మాత్రమే అలాంటి స్వభావం ఉండటంవల్ల మరేదీ గాదు. అదే పామనేది వస్తుతః అక్కడ లేకపోయినా ఉన్నట్టు భాసింపజేసింది. మిగతా వస్తువులలో ఆ స్వభావం లేదు కాబట్టి భాసింపజేయలేదు. అప్పటికి ఒక వస్తువు మరొక వస్తువుగా భాసిస్తున్నదంటే దానికి నిమిత్త మావస్తు స్వభావమేనని తేలిపోయింది.

   ఇలాంటి ఒకానొక స్వభావమే ప్రస్తుత మా ఈశ్వరుడికి కూడా ఉంది. దానికే ప్రకృతి అనీ, మాయ అనీ, శక్తి అనీ, ఇంతకు ముందు మనం పేర్కొని ఉన్నాము. ప్రకృతి అనే మాటకు స్వభావమనే గదా అర్థం. ఇలాంటి స్వభావమొకటి ఉండటం మూలాన్నే అదే మనకీ జీవ జగద్రూపంగా భాసిస్తున్నది. భాసిస్తున్నదంటే కార్యరూపమైన వీటి రెండింటి లక్షణాలూ మూలకారణమైన దాని మాయాశక్తిలోనే అంతర్లీనమై ఉన్నాయన్న మాట. పాము లక్షణాలు త్రాడులో ఎలా అంతర్లీనమై ఉన్నాయో అలాగే ఉన్నాయి అవి. “తే యదంతరా తదహ్మ” అని శాస్త్రమే ఘోషిస్తున్నది. అంతేకాదు. ఈశ్వరుడి శక్తి ఎప్పుడయిందో అప్పుడది ఈశ్వరుడిలాగా పరిపూర్ణమే కావాలి గాని అపరిపూర్ణం కాగూడదు. అంటే ఎలాగంటే అలా మారిపోయే లక్షణాలన్నీ దానికుండి తీరాలని భావం. "పరాస్యశక్తి ర్వివిధైవ శ్రూయతే” అని ఇంతకు ముందు ప్రతిపాదించాము.

Page 53