అయితే వ్యావహారికమనీ, పారమార్థికమనీ సత్యాన్ని రెండుగా విభజిస్తే అది మన అద్వైత సిద్ధాంతానికే ముప్పు గదా అని మరలా ఆక్షేపణ రావచ్చు. అద్వైతానికెప్పుడూ అలాంటి ముప్పు లేదు. సత్యమనేది దానిపాటికది స్వయంగా విభక్తమయి ఉంటే మనమలా శంకించటం న్యాయమే. కాని అది స్వయంగా ఏర్పడిన విభాగం కాదు. కేవలం లోకదృష్టిని బట్టి ఏర్పరచుకొన్న విభాగమేనని చెబుతున్నాము. అలాంటప్పుడది వాస్తవమెలా అవుతుంది. వాస్తవం కానప్పుడది వస్తువునేమీ చేయలేదు. ప్రస్తుత మాకాశంలో మన దృష్టి దోషం మూలంగా ఒక మాలిన్యాన్ని చూస్తున్నాము. అంతమాత్రాన అది నిర్మలమైన ఆకాశాన్ని మలినం చేయగలదా. ఆకాశ మాకాశమే. దానిని మనం మలినంగా చూస్తున్నా ఆ మాలిన్యమక్కడ లేదు. మన దృష్టి దోషమే అది.
అలాగే వ్యావహారికంగా భాసిస్తున్న ఈ జీవ జగత్తులు కూడా నిజంలో లేవు. మన దృష్టి దోషం కారణంగా ఉన్నట్టు భాసిస్తున్నాయి. అంతమాత్రమే. అంచేతనే వీటి మూలంగా పారమార్థికమైన అద్వైత తత్త్వానికి ఎలాటి హానీ లేదు. హాని లేదు సరిగదా - ఇలాంటి విభాగమొకటి తాత్కాలికంగా చేయటం వల్ల జటిలమైన అనేక సమస్యల నతి సులభంగా పరిష్కరించగలిగారు జగద్గురువులు. వ్యావహారికమని చెప్పి ఆయన మనందరికీ కలిగే లోకానుభవాన్నీ సమర్థించారు. అలాగే పారమార్థికంగా ఉన్నదొకే ఒక సత్యమని చాటి శాస్త్ర సిద్ధాంతాన్నీ నిలబెట్టారు. ఇలా రెంటినీ రెండు భూమికలలో సమర్థించి పరస్పర వైరుధ్యం లేకుండా సమన్వయించటంలోనే ఉన్నదాయన గారి అసాధారణమైన ప్రతిభ.
అయితే అప్పటికీ మనమింకా ఒక సమస్యకు జవాబు చెప్పవలసి వస్తుంది. అదేమిటంటే నిజంలో ఎప్పుడూ ఉన్నదొక్క పారమార్థికమే గదా. అది ఏకమేగాని అనేకం కాదుగదా. అలాంటప్పుడనేకంగా అది ఎలా మారిపోయింది. మారిపోవటం వల్లనే గదా జీవజగత్తులనేవి రంగంలోకి వచ్చింది. అలా రాకపోతే మన మీ వ్యావహారికమనే విభాగమే చేయవలసిన అగత్యం లేదు గదా.
Page 52