చూస్తూనే అది లేదని ఎలా వాదిస్తారని వారికి చీవాట్లు పెట్టారు శంకర భగవత్పాదులు. అయితే శంకరుల మాయా వాదం కూడా ఇదే గదా అని మన కనుమానం కలగవచ్చు. ఇలాంటి అనుమానం మనకే గాదు. అనేకమంది మాతాచార్యులకే కలిగి ప్రచ్ఛన్న బౌద్ధుడని పేరు పెట్టి ఆయనను పరిహసించారు కూడా. కాని నిజమాలోచిస్తే బౌద్ధుల విజ్ఞానవాదం వేరు. శంకరుల మాయావాదం వేరు. రెంటికీ పర్వత సర్షపాలకున్నంతటి తేడా ఉంది.
విజ్ఞానవాదులు ప్రపంచమసలు లేనే లేదు పొమ్మన్నారు. శంకరులు లేదని ఎప్పుడూ చెప్పరు. ఈశ్వర చైతన్యానికి భిన్నంగా లేదని మాత్రమే ఆయన చెప్పిన మాట. అంటే అర్థం. ఈ ప్రపంచం ఘటపటాది రూపంగా లేదనే గాని చైతన్య రూపంగా అది ఎప్పుడూ ఉండనే ఉంది. అయితే ఆ రూపంగా భావించి చూడటం లేదు మనం. దానికి బదులు ఘట పటాది రూపంగానే దర్శిస్తున్నా మీ ప్రపంచాన్ని. ఊరక దర్శించటమే కాదు. అదే సత్యమని దానితో ప్రతి క్షణమూ వ్యవహరిస్తున్నాము. తన్మూలంగా కలిగే సుఖదుఃఖాదులు కూడా యధార్ధంగానే ఉన్నవని అనుభవిస్తున్నాము అయినా ఇది ఆ బ్రహ్మచైతన్య వివర్తమే కాబట్టి అదే ఈ రూపంలో కనపడుతూ ఉంది కాబట్టి ఆ మేరకీ వ్యవహారం కూడా ఉందనే ఒప్పుకోవలసి వస్తుంది. అసలే లేదని త్రోసి వేయరాదు. పైగా ఇది ఒక నా నీ అనుభవం కాదు. లోకంలో ముప్పాతిక మూడు పాళ్ళమంది అనుభవం. నీవు కాదన్నా మరొక డనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టివాళ్ల అనుభవం మేరకైనా తాత్కాలికంగా ఈ వ్యవహారముందని మనం ఒప్పుకోవలసిందే.
ఇలా వ్యవహారం నిమిత్తంగా ఒప్పుకొన్నది కాబట్టి దీని కాయన వ్యావహారిక సత్యమని Relative truth నామకరణం చేశారు. వ్యవహారిస్తూ ఉన్నంత వరకూ సత్యమని ఏది భావిస్తామో అది వ్యావహారిక సత్యం. జీవజగత్తులనేవి రెండూ ఇలాంటి ఒక వ్యావహారికమైన సత్యమే. అయితే ఎంత సత్యమని చాటినా అది కేవలం మన బోటి మానవుల అనుభవాన్ని బట్టి చెప్పటమే గాని వస్తు స్వభావాన్ని బట్టి కాదు. వస్తువక్కడ ఏమిటా అని పరిశీలిస్తే మాత్రం జీవుడూ లేడు. జగత్తూ లేదు. రెండింటి బదులూ ఉన్నదొక్క ఈశ్వరుడే మరలా. దీనికే ఆయన పారమార్ధిక సత్యమని Absolute truth పేరు పెట్టారు.
Page 51