#


Back

2. వ్యావహారికం-పారమార్థికం

  కడచిన అధ్యాయంలో మన మఖండమైన బ్రహ్మ చైతన్యమొక్కటే సత్యమనీ దానికి భిన్నమైన పదార్థం మరి ఏదీ లేదనీ నిర్ధారణ చేశాము. అలాంటప్పుడు న్యాయమైతే మనకిక సృష్టిలో ఏదిగానీ అగపడగూడదు. అయినా ఒక జీవుడనీ, జగత్తనీ, నిత్యమూ అనుభవానికి వస్తూనే ఉన్నాయి. ఎంత మిథ్య అని భావించినా అవి మన అనుభవానికి రావటం మానలేదు. అనుభవాన్ని కాదని ఎలా త్రోసిపుచ్చగలం. అది కేవలం ఆత్మవంచన అవుతుంది. అలాగని శాస్త్రప్రమాణాన్నే కాదందామంటే అది సక్రమంగా విచారణ చేసి తేల్చుకొన్న సిద్ధాంతం. ఎలా కాదనగలం. పోనీ రెండింటినీ పరిగ్రహిస్తే సరిపోదా అంటే అవి రెండూ పరస్పర విరుద్ధమయి కూచున్నాయి. కొంచెమైనా పొందికలేదు వాటికి. ఈ పరిస్థితిలో వీటి రెండింటినీ మనమెలా సమన్వయించుకోవాలని ప్రశ్న వస్తుంది.

   శంకరులీ ప్రశ్నను చాలా దూరమాలోచించారు. చూడబోతే ఇది ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య అన్నట్లున్నది. ఇటు లోకానుభవాన్నీ కొట్టి వేయలేము. అటు శాస్త్రాన్నీ కాదనలేము. అయితే శాస్త్రమనేది లోకానుభవం కన్నా ప్రామాణికమని చెప్పారు గదా అని అడగవచ్చు. ప్రామాణికమే. సందేహం లేదు. కాని అది మానవుడి అనుభవానికి వచ్చినప్పటి మాట. శాస్త్రమనుభవానికి వచ్చినప్పుడే మనం లోకానుభవాన్ని కాదనగలిగేది. అంతవరకూ అది కేవలమొక సిద్ధాంతం మాత్రమే. సిద్ధాంత బలంతోనే నిత్యమూ నలుగురికీ కలిగే అనుభవాన్ని కొట్టివేసే అధికారం మనకు లేదు. ప్రస్తుతం మనకందరికీ ఈ ప్రపంచమనే దొకటి కనిపిస్తూ ఉంది. కనిపిస్తూ ఉన్నదాన్ని కాదని ఎలా అనగలం. కాదంటే అది మన అనుభవాన్నే కప్పి పుచ్చినట్టవుతుంది గదా. అనుభవాన్ని కప్పి పుచ్చటంకన్నా అపహాస్య మేమున్నది.

   ఇలాంటి అపహాస్యత పాలయిన వారే బౌద్ధులలో ఒక శాఖవారైన విజ్ఞాన వాదులు. మానవుడి విజ్ఞానాన్ని మించి బాహ్యంగా మరే పదార్ధమూ లేదు. ఉన్నదంతా అంతరమైన విజ్ఞానమేనని వాదిస్తారు. ఒకప్రక్క మీరు బాహ్యమైన ప్రపంచమొకటి

Page 50