ఇక ఆత్మ అని ఆకళింపుకు వస్తుంది. అది ఇక ప్రత్యక్కా-పరాక్కా- అని ప్రశ్నేముంది. అంతా మన స్వరూపమే అయినప్పుడిక ఏదీ మనకు బాహ్యంగా ఉండటానికి లేదు. జగత్తూ ఉండలేదు. ఆ మాటకు వస్తే ఈశ్వరుడూ ఉండలేడు. మనఅఖండ స్వరూపాన్ని గుర్తించనంతవరకే అవి రెండూ మనకు వేరుగా భాసించేది. గుర్తించగలిగితే అవి రెండూ మనలోనే చేరిపోతాయి. అప్పుడంతా కలిసి మనకు ప్రత్యగాత్మ రూపంగానే అనుభవానికి వస్తుంది.
దీనిని బట్టి మన మర్థం చేసుకోవలసిందేమంటే జీవజగత్తులనే ఉపాధులున్నంత వరకూ వాటి నీశనం చేసే చైతన్యమొకటి ఉండక తప్పదు. అప్పుడు దాని కీశ్వరుడని పేరు. ఆ జీవ జగత్తులు రెండూ మిథ్యాభూతమని ఎప్పుడు తేలుతుందో అప్పుడదే బ్రహ్మం. దానినే ఈ శరీరాదులకు వెలపల ఎక్కడో ఉందని మనం భావించినంత వరకూ అది పరమాత్మ. పోతే మన ఈ శరీరాదులు కూడా బాహ్య జగత్తులాగా మిథ్యే గదా అని నిశ్చయం చేసుకొని చూచామంటే అప్పుడీ జగత్తు లేదు. జీవుడూలేడు. పరమాత్మా లేదు. అంతా కలిసి చివరకు ఆత్మ స్వరూపమే. స్వరూపమే కాబట్టి అది ఎప్పుడూ అభావం కాదు. అభావం కాకపోతే అది నిత్యసత్యమైన పదార్థం. సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమది. సజాతీయం దానికి జీవుడు. విజాతీయం జగత్తు. పోతే స్వగతమనేది దానికే ఉన్నవని భావించే నామరూపక్రియాది విశేషాలు. ఇవన్నీ అవిచారిత సిద్ధమేగాని సక్రమంగా విచారణ చేసి చూస్తే అంతా దాని స్వరూపమే. కనుక దాని కభిన్నమే. దానికి భిన్నంగా ఇక ఏది ఉందని భావించినా అది కేవలం మిథ్యా భూతమేనని చివరకు తీర్మానం.
ఇక్కడికి సత్యమనే రెండవ విభాగాన్ని కూడా విమర్శించి చూచాము. దీనితో సత్య మిథ్యా విచారణలు రెండూ కూడా సమాప్తమయినట్టే. పోతే ఇంతవరకూ జరిగిన మీమాంస కంతటికీ సారాంశమేమిటని ఇప్పుడు ప్రశ్న. జీవుడూ -జగత్తూ-ఈశ్వరుడూ నని మూడు పదార్థాలు పరస్పర భిన్నంగా కనిపిస్తున్నాయి మన దృష్టిలో. మూడూ దేనిపాటికది సత్యమే నని కూడా మనం భావిస్తుంటాము. ఇది కేవలం మన లోకానుభవమే గాని శాస్త్ర ప్రమాణం వల్ల ఏర్పడింది కాదు.
Page 48