#


Back

   అభావమని చెప్పటానికక్కడ సాక్షి ఏమిటి. ఏదో ఒక చైతన్యముండి గదా అది అభావమని గ్రహించవలసింది. చైతన్యమున్నదంటే ఇక ఆత్మ ఉందనే గదా అర్థం. చైతన్యమే గదా ఆత్మ అంటే. మరి అభావమనే మాట కర్థమేమిటి. ఆత్మ అభావం కావాలంటే ఆ అభావానికి కూడా అదే సాక్షి కావాలి. భావానికెలా సాక్షో అది అభావానికి కూడా అలాగే సాక్షి. కాబట్టి దాని కభావమెప్పుడూ చెప్పలేవు. చెప్పబోతే ఆ చెప్పేదే ఆత్మ అవుతుంది. అంచేత అది ఎప్పుడూ ఉంది.

   ఎప్పుడూ ఉంది గనుకనే అది మనకెప్పుడూ అనుభవానికి వచ్చే తీరాలి. మరి మనకెందు కనుభవానికి రావటంలేదని గదా ప్రశ్న. వస్తూనే ఉంది. అసలు రాకపోవటమంటూ లేదు. మన స్వరూపమే అయినప్పుడెలా రాకపోతుంది. అంతో ఇంతో వస్తూనే ఉంది అనుభవానికి. కానీ రావలసినంత స్వచ్ఛంగానూ పరిపూర్ణం గానూ మాత్రమే రావటం లేదది. జాగ్రదావస్థలో అన్నిఇంద్రియాలు పని చేస్తుంటే అది బాగా మనకు సన్నిహితమయినట్టు తోస్తుంది. స్వప్నంలో ఇంద్రియ వృత్తులన్నీ లయమై మనసు మాత్రం పని చేస్తుంటే ఆమేరకుందని భావిస్తాము. మరి సుషుప్తిలో మనసుకూడా పని చేయక ఒక ప్రాణం మాత్రమే కదులుతుంటే అప్పుడంతవరకే అర్థం చేసుకొంటాము దాని అస్తిత్వాన్ని. పోతే ఇవన్నీఒక ఎత్తు చివరకు మరణమనే దొక ఎత్తు. ఆ దశలో ఇంద్రియాలేమిటి-మనస్సేమిటి- ప్రాణమేమిటి అన్ని వృత్తులు ఒక్కసారిగా ఆగిపోతాయి. దానితోఈ చెప్పిన ఉపాధులన్నింటిలోనూ మనకు సంబంధం తెగిపోతుంది. అప్పుడీ ఆత్మకూడా వాటితో పాటే అభావమయి పోయినట్టు మన కనిపిస్తుంది.

   ఈ విధంగా జీవితాంతమూ మనః ప్రాణాదులైన ఉపాధుల నెక్కడికక్కడ చూచి అవే నేనని భావించటంవల్లనే మన ఆత్మ మనకు పదహారు కళలలో భాసించటంలేదు. ఈ ఉపాధులే లేకపోతే మన ఆత్మకిక ఎలాటి అవధులూ ఉండబోవు. ఉపాధులుపాధులని మాటేగాని అసలీ ఉపాధులే గగన కుసుమాలనిచాటుతున్నది శాస్త్రం. ప్రపంచమంతా మిథ్య అని గదా తీర్మానించాము. అలాంటప్పుడీ శరీరాద్యుపాధులు మాత్రమెక్కడ ఉన్నాయి అవీ లేవు నిజానికీ. అయితే ఉన్నాయని భ్రమ పడుతున్నాము. కాబట్టి ఆ భ్రమ పోగొట్టుకోటమే మనం చేయవలసిన పని. అది పోతే చాలు.

Page 46