అంచేత ప్రపంచానికంతా ఒక సాక్షి ఉండాలని చెప్పి దీని కతీతంగా వేరొక ఆత్మ నూహించి దానికి పరమాత్మ అని పేరు పెట్టాము మనం. అది ఈ ఉపాధులున్నంతవరకూ మనకు దూరంగా ఎక్కడో ఉన్నట్టు భాసిస్తుంటుంది. ఎప్పుడీ ఉపాధులన్నీ లేవని మనం భావిస్తామో అప్పుడా దూరంగా కనిపించిన పరమాత్మే దగ్గరగా వచ్చి ప్రత్యగాత్మ గానే మన కనుభవమిస్తుంది.
ఇంతకూ ఈ గందరగోళానికంతా కారణ మీ ఉపాధి వర్గమే తప్ప మరేదీ గాదు. ఉపాధులంటే ఈ శరీరాది సంఘాతమేనని గదా చెప్పాము. త్వగింద్రియం దగ్గరి నుంచీ అహంకారాందాకా మనలను పూసుకొని ఉన్నదీ సంఘాతం. నిజానికిందులో ఏ ఒక్క అంశమూ నేను గాదు. నాకీ ఉపాధి లక్షణాలేవీ కానరావు. ఎప్పటి కప్పుడవి మారుతున్నా నేను మాత్రం మారకుండాఅలాగే నిలిచి ఉన్నాను. నేనుకూడా మారాలంటే అంతకు ముందున్న నా స్వరూపం పోయి క్రొత్తది రావాలి గదా. నాకున్న రూపమేమిటీ. నేననే స్ఫురణమే. అంతకుమించి మరేదీ లేదు. ఆ ఒక్కటీ పోతే ఇక నేననే దెక్కడ ఉంది. ఎక్కడా లేకుండా పోవాలి నేను. కాని అలా ఎప్పటికీ జరగదు. ఏ క్షణంలో ఎవడిని పలకరించినా నేనున్నాననే పలుకుతాడు గానిఎప్పుడూ నేను లేనని చెప్పలేడు. ఒకవేళ నీవు లేదనుకొన్నా అది లేకపోయేది కాదు. ఆగంతుకమైతే తొలిగిపోవచ్చు గాని నీ స్వరూపమే అయినదెలా పోగలదు. పైగా ఎంతెంత లేదని భావిస్తే అంతంత బలపడుతుందది. అసలు లేదని భావించటానికైనా నీవుండి గదా భావించవలసింది. నీవుంటే ఇక నీ స్వరూపమున్నట్టే గదా. దేనినైనా వదులుకోగలం గాని మన స్వరూపాన్నే మనం వదలుకో లేము. వదలుకోవాలంటే వదలుకొనేదీ వదలుకోబడేదీ కూడా అదే కావలసి వస్తుంది. అది ఆత్మాశ్రయ దోషం క్రిందికి వస్తుందంటారు శాస్త్రజ్ఞులు. అగ్ని తన్ను తాను కాల్చుకోలేదు. ఆటకాడు తన భుజాలమీద తాను నిలుచోలేడు. అలాగే ఆత్మకూడా తన్ను తాను కాదనుకోలేదు.
అయితే కాదనుకోకపోతే అది మనకెప్పుడూ అనుభవానికి రావాలి గదా. ఏదీ నిద్రలో రావటం లేదది. మూర్ఛలో రావటం లేదు. జ్వరంలో రావటం లేదు. మరి మరణంలోనైతే అసలే రావటం లేదే. స్వరూపమే అయినప్పుడు రావాలి గదా అని ఆక్షేపణ రావచ్చు. వాస్తవమే. రావటంలేదు. కాని ఆ రావటం లేనిదెవరికని అడుగుతున్నా రాచార్యులవారు. రాకపోవటమనేది ఒక అభావం Absence.
Page 46