కాబట్టి దానిపాటికని పరోక్షంగా కాదు చెప్పవలసింది. నాపాటికి నేనున్నానని అపరోక్షంగానే అనుకోవాలది. చైతన్య స్వరూపమే కాబట్టి దానికి “నేను” అనే భావనేర్పడటాని కభ్యంతరం కూడా లేదు. అచేతనానికైతే ఏర్పడదు గాని దానికది సహజంగానే ఏర్పడుతుంది. అప్పటికి చైతన్యమంటే అది ఎప్పుడూ "నేను-నేను” అనే స్ఫురణే తప్ప మరేదీ గాదని అర్థమయింది. ఈ నేననే స్ఫూర్తి ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరికీ ఉంది. ఇది మనకందరికీ అనుభవసిద్ధమే. మనలో ప్రతి క్షణమూ తోచే ఈ నేననే స్ఫురణకే ఆత్మ Self or subject అని పేరు పెట్టారు వేదాంతులు. అయితే ఇది ప్రత్యగాత్మ Individual self. అంటే మన పిండ శరీరంలోనే ఉండి నేను అనుకొనే ఆత్మ అని అర్థం. పోతే ఈ ఆత్మను బట్టి బ్రహ్మాండ శరీరాన్నంతటినీ వ్యాపించిన ఆత్మకూడా ఇలాంటిదేనని అర్ధం చేసుకోవచ్చు మనం. ఇది ప్రత్యగాత్మ అయితే అది పరమాత్మ Universal Self అన్నారు. ఈ పరమాత్మే బ్రహ్మమనేది. అది కూడా ప్రత్యగాత్మ లాగా “నేను” అనే స్ఫురణ మాత్రమే కాబట్టి నాలాగే ఉంటుందని అనుభవానికి తెచ్చుకోవటం సులభమే.
అసలు ప్రత్యక్కని Inner పక్కని Outer రెండుగా పేర్కొంటున్నామే గాని నిజంలో ఇన్ని ఆత్మలు లేవు. ఉన్నాయని చెబితే అందులో ఒకటి మరొక దానికి ప్రమేయం Object కావలసి వస్తుంది. ప్రమేయమైతే అది అనాత్మ Nonself అవుతుంది గాని ఆత్మకాదు. కాబట్టి ఆత్మ అనే దెప్పుడూ ఒక్కటే తప్ప రెండుండటానికి వీలులేదు. ఆ ఒక్కటీ కూడా ప్రత్య గ్రూపంగానే ఉండాలి గాని పరాగ్రూపంగా ఉండరాదు. పరాగ్రూపమైతే అది నాకు దూరమవుతుంది. నాకు దూరమైనప్పుడది నేనెలా అవుతాను. నేను గాకపోతే అనాత్మ అవుతుందే గాని ఆత్మ అనిపించుకొనే అర్హత లేదు దానికి. కాబట్టి ఆత్మ అనేదెప్పుడూ ఏకమే. అది ప్రత్యగ్రూపమే. అంటే నేను-నేనని ప్రస్తుతం మన అందరి అనుభవానికి వస్తున్న ఈ ప్రత్యగాత్మే అసలాత్మ అన్న మాట. అయితే ఆ పరమాత్మ అనేదేమిటింతకూ. పరమాత్మ అంటూ ఒకటి ఎక్కడా లేదు వాస్తవానికి. ప్రత్యగాత్మే ఆత్మ. అదే శరీరాద్యుపాధులతో మమేకమయి పోవటం మూలాన సంకుచితమయి భాసిస్తున్నది. సంకుచితమయ్యే సరికి ప్రపంచానికంతటికీ అది సాక్షి కాలేకపోతున్నది. సాక్షి లేకపోతే ప్రపంచమసలుండనే లేదని పేర్కొన్నాము.
Page 45