ప్రస్తుత మా స్వరూపాన్ని గ్రహించటానికి కూడా ఇలాంటి ప్రమాణమేమిటా అని మన అన్వేషణ.
ప్రమాణమేదీ దానికక్కరలేదంటారు భగవత్పాదులు. అచేతనానికైతే దానికొక ప్రమాణం కావాలి. ఎంచేతనంటే దానికి తానున్నాననే ప్రజ్ఞలేదు. పోతే ప్రస్తుత మీ బ్రహ్మమనేది అచేతనం కాదు. పరిపూర్ణమైన చేతన పదార్థమది. చేతనం గనుకనే తానున్నాననే ప్రజ్ఞ దానికెప్పుడూ ఉన్నది. అసలు ప్రజ్ఞాన స్వరూపమే అది "ప్రజ్ఞానమ్ బ్రహ్మ" అని ఉపనిషద్వాక్యం. అలాంటప్పుడిక దానికి ప్రమాణంతో పని ఏముంది. ప్రమాణమంటే తెలుసుకొనే సాధనమేనని గదా చెప్పాము. తెలుసుకొనే స్తోమత దానికే ఉన్నప్పుడిక సాధనం చేసే మేలేమిటి దానికి. జ్ఞానమే గదా దాని స్వరూపం. అలాంటి జ్ఞానానికి మరలా సాధనం దేనికి. అనావశ్యకం. జ్ఞానమంటే అది ఒక దీపంలాంటిది. దీపాన్ని వెలిగించటానికి మరి ఒక దీపమెలా అక్కరలేదో జ్ఞానానికి కూడా మరి ఒక జ్ఞానమక్కరలేదు. ఉంటుందని వాదిస్తే దానికేమిటి దానికేమిటని ప్రశ్న వస్తుంది. అది అనవస్థా దోషానికి Ad Infinitum దారి తీస్తుంది. కాబట్టి పారమేశ్వరమైన జ్ఞానం స్వతః ప్రమాణ Self evident మని ఒప్పుకోక తప్పదు.
స్వతః ప్రమాణమయితే అది ఇక ప్రమేయకోటినే Field of objectivity దాటి పోతుంది. ప్రమేయమంటే ఏదో ఒక ప్రమాణానికి గురికావటం. ఇలా గురి అవుతుంది గనుకనే ఈ లోకమంతా ప్రమేయమయింది. పోతే ఈశ్వరచైతన్యమలా కావటం లేదు కాబట్టి అది ప్రమేయం కాదు. అప్రమేయమే అవుతుంది. అప్రమేయ మయితే మరి దాన్ని పట్టుకోటమెలాగ. పట్టుకోలేకపోతే ఉందని చెప్పి ఇక ఏమి ప్రయోజనమని మరలా ప్రశ్న వస్తుంది. వేదాంతంలో ఇది చాలా గడ్డయిన ప్రశ్న. పదార్థమేమో ఉందని చెబుతున్నారు. కాని దాన్ని అనుభవానికి తెచ్చుకొనే మార్గం కనపడటం లేదు. ఏమిటి దీనికి పరిష్కారం. చూడబోతే దీనికి పరిష్కారమే లేదా అనిపిస్తుంది.
కాని జగద్గురువుల దృష్టి అనన్యాదృశం. పరిష్కారమే లేదనిపించే ఈ సమస్య కొక అమోఘమైన పరిష్కారాన్ని సెలవిచ్చారాయన. అది ఎలాగోచూతాము. బ్రహ్మమనేది దేనికీ ప్రమేయం కాదంటే అప్పటికి దానిపాటి కదే ఉందని అర్థం. దానిపాటికదే ఉందని ఎవరన్నారు. మరొక పదార్ధమే లేదు గదా అనటానికి.
Page 44