ఏమిటా ఈశితవ్యం. జీవుడూ- జగత్తూ. ఈ రెంటినీ ఈశనం చేసేవాడు. గనుకనే అతడీశ్వరుడు. ప్రస్తుతమవి రెండూ దానికి భిన్నంగా లేనేలేవని గదా ప్రతిపాదించాము. అలాంటప్పుడిక దేనిమీద ఈశనం చేయాలది. కాబట్టి ఈశ్వరుడనే నామమే అప్పుడెగిరిపోతుంది. పోతే మరి ఏమని పేర్కొనాలి ఆ పదార్ధాన్ని, బ్రహ్మమని పేర్కొనాలంటా రాచార్యులవారు. జీవజగత్తు లొకటి ఉన్నవని భావించి దాని నీశ్వరుడని వ్యవహరిస్తూ వచ్చామే గాని అసలు పరిశుద్ధమైన ఆ తత్త్వానికి బ్రహ్మమనే పేరు. బ్రహ్మమనే మాటకు మూడు భూమికలలో మూడు నిర్వచనాలు సెలవిచ్చారు. జగద్గురువులు. "బృహత్త్వాత్ బ్రహ్మ” అన్నింటికన్నా పెద్దది కాబట్టి అది బ్రహ్మం. "బృంహణ త్వాత్ బ్రహ్మ" ఆకాశాదికమైన సమస్త ప్రకృతినీ తన గర్భంలో ఇముడ్చుకొనేది కాబట్టి కూడా అది బ్రహ్మం. అంతేకాదు. "బర్హణత్వా దృహ్మ” అన్ని పదార్ధాలనూ తనలో ఇముడ్చుకోటమే గాక వాటన్నిటినీ నిశ్శేషంగా తనలో లయం చేసుకోవటంవల్ల కూడా అది బ్రహ్మమే. “నిశ్శేష సంసార బీజా విద్యా ద్యనర్ధ నిబర్హణా" త్తని భాష్యంలోనే సెలవిచ్చారు. ఇలా సజాతీయ విజాతీయాది భేదాలన్నీ లయమైపోతే ఇక మిగిలేది శుద్ధమైన చైతన్యమే. ప్రజ్ఞాన ఘనమని వర్ణించిం దుపనిషత్తు. సైంధవఘనంలాగా ప్రజ్ఞాన ఘనమది. ఒక లవణ పిండం ఎక్కడ ఏ కణం రుచి చూచినా అది లవణరసమే. అంతకుమించి రసాంతర స్పర్శలేదు దానికి. అలాగే ఈ బ్రహ్మమనేది కూడా విజాతీయ భావ సంపర్కమే మాత్రమూ లేని ప్రజ్ఞానైక రసస్వరూపం. అంచేత ఆ చైతన్యమనే దొక్కటే దాని స్వరూపమని గ్రహించాలి మనం.
సరే ఇంతవరకూ బాగానే ఉంది. కాని ఇలాంటి తత్త్వాన్ని మనం పట్టుకోట మెలాగా అని ఇప్పుడు ప్రశ్న. పైన చెప్పిన రెండు లక్షణాలూ ఉన్నాయి గదా అంటే అవి లక్షణమే గాని ప్రమాణం కాదు. లక్షణం వేరు. ప్రమాణం వేరు. లక్షణమొక పదార్థముందని దాని అస్తిత్వాన్ని మాత్రమే నిరూపిస్తుంది. పోతే ప్రమాణమలా కాదు. దాని స్వరూపం ఫలానా అని మన మనసుకు తెచ్చుకోటానికి తోడు పడుతుంది. లక్షణం పదార్ధాన్ని పరోక్షంగా సూచిస్తే ప్రమాణం దాన్ని ప్రత్యక్షంగానే పట్టి ఇస్తుంది. ప్రమ అంటే జ్ఞానం. ప్రమకు సాధనం కాబట్టి అది ప్రమాణం. జ్ఞాన సాధనమని అర్థం. చక్షురాదులైన మన ఇంద్రియాలిటువంటి సాధనాలే. వాటి మూలంగా మనం రూపరసాది ప్రమేయాలనన్నింటినీ అనుభవానికి తెచ్చుకోగలుగుతున్నాము.
Page 43