#


Back

   ఒక నిప్పురవ మన కంటికి కనిపించిందంటే ఎక్కడో ఒక అగ్నిహోత్రం ప్రజ్వలిస్తూ ఉండక తప్పదు. ఒక జల బిందువు మన ఒంటికి సోకిందంటే ఎక్కడో ఒక పెద్ద జలాశయం ఉండక మానదు. అలాగే మనబోటి ప్రాణికోటి కంతటికీ ఇప్పుడంతో ఇంతో చైతన్యమనేది తరతమ భావంతో కనిపిస్తూ ఉంది. కాష్ఠ లోష్టాదుల లాగా అసలు లేకపోలేదు. ఉంటే నిండి నిబిడీకృతమై తొణికసలాడటం లేదు. వెలితిగా కనిపిస్తూ ఉన్న ఈ జీవ చైతన్యాన్ని బట్టి చూస్తే రాశీభూతమైన ఒక మహాచైతన్యమేదో ఉండి తీరాలని సులభంగా మన మూహించ గలం. ఏతావతా తేలిందేమిటి. తమ పాటికి తాము కేవలం మిధ్యాభూతమే అయినా ఈ జీవజగత్తులు రెండూ ఆ ఈశ్వరుడే సత్యమని చాటటానికి మరలా చక్కని సాధనాలుగా పని చేస్తున్నాయి.

   అయితే ఈ రెండింటి లక్షణాన్ని బట్టి డొంక తిరుగుడుగా గ్రహించవలసిందేనా లేక ఆ ఈశ్వరుడనే దానికొక స్వరూపమంటూ ఏదైనా ఉందా అని మరలా ప్రశ్న వస్తుంది. ఉంది. స్వరూపమంటూ లేకపోతే మరొక దాని నిమిత్తంగా ఏర్పడే సిద్ధి అది సిద్ధేకాదు. ఉన్నట్టుండి ఆ నిమిత్తం తొలగిపోతే ఇదీ పోతుంది. అది మొదలు చెడ్డ బేరం. ఇలా మొదలు చెడ్డ బేరమయ్యే గదా జీవజగత్తులు రెండూ మిథ్య అని ఇంతకు ముందే మనం నిర్ణయించింది. అదే పొరబాటు మరలా ఈశ్వరుడి విషయంలోనూ జరిగితే ఏమి ప్రయోజనం. పైగా మిథ్యాభూతమైన జీవజగత్తులకు స్వరూప Essense మీశ్వరుడేనని చెప్పాము. అలాంటప్పుడా ఈశ్వరుడికే స్వరూపం లేదంటే ఏమి మర్యాద. జీవజగత్తులలాగా అది కూడా మిథ్య అయి మరొక దానిమీద ఆధారపడవలసి వస్తుంది ఇవి మూడూ గాక మరొక పదార్థమనేదే లేదు గదా సృష్టిలో. అంచేత ఎటు చూచినా జీవజగత్తుల లాగా స్వరూప రహితం కావటానికి లే దీశ్వరుడు. స్వతస్సిద్ధమైన Selfreliant తత్త్వం గనుక తప్పకుండా దానికొక స్వరూపమంటూ ఉండి తీరాలి.

   అయితే ఏమిటా స్వరూపమని అడగవచ్చు. ఈశ్వరుడి స్వరూపమనే దేమిటో ఇంతకు ముందే ఏ కరువు పెట్టాము. శుద్ధమైన చైతన్యమే దాని స్వరూపం. “శుద్ధమ్–బుద్ధమ్–ముక్త” మని వర్ణిస్తారు శంకర భగవత్పాదులు. ఆకాశం శుద్ధమైన పదార్ధమే. కాని బుద్ధం కాదది. అంటేజ్ఞానం లేదని అర్థం. పోతే జీవుడనే తత్త్వం బుద్ధమే. కాని ముక్తం కాదు. అది ఒక శరీరమనే ఉపాధికి బద్ధమయి ఉంది.

Page 41