కాబట్టి జీవ జగత్తులు రెండూ దానికి లక్షణమవుతున్నాయి. ఎలా అవుతాయని అడగవచ్చు. అది ఎలాగో ఇంతకు ముందే కొంత వర్ణించి ఉన్నాము. అయినా ప్రసంగం వచ్చింది కాబట్టి పాఠకుల సౌకర్యార్థం మరలా ప్రస్తావన చేయవచ్చు, తప్పులేదు.
జీవ జగత్తులలో జగత్తనేది దానికెలా లక్షణమో మొదట పరిశీలిద్దాము. దృష్టాన్ని బట్టి అదృష్టాన్ని ఊహించమన్నారు పెద్దలు. “న హి దృష్టే అనుపపన్నమ్ నామ" అన్నట్టు కనిపించే దాని విషయంలో మనకెప్పుడూ సందేహం లేదు. ఎటు వచ్చీ కనపించని ఈశ్వరుడి విషయంలోనే మనకు పట్టుకొన్న సందేహం. అది ఈ కనిపించే జగత్తును బట్టే మనం విచారణ చేసుకోవచ్చు. జగత్తంటే అది ఒక అచేతనమైన పదార్థం. అచేతనమెప్పుడూ దానిపాటికది భాసించలేదు. దాన్ని భావింపజేయటాని కొక చేతన పదార్థం కావాలి. ఆ చేతన పదార్థమే ఈశ్వరుడు. పోతే జగత్తనేది ఒక సంహతమైన Compound పదార్థం. అది ఒకటి కాదు. అనేక పదార్ధాల కూడిక అది. ఎన్నో కలిసి ఒక పదార్ధంగా ఏర్పడ్డాయి. అలాంటి సంహతమైన దెప్పుడూ తన కోసం కాదు. తనకు విలక్షణమైన మరొక అసంహతం Simple కోసమే ఏర్పడుతుంది. అలాంటి అసంహతమైన పదార్థమే ఈశ్వరుడు. అలాగే ఈ ప్రపంచమంతా సాపేక్షం. మరొక దాని అపేక్ష లేకుండా ఇందులో ఏదీ సిద్ధించదు. ఆ మరొక దాని కింకొక దాని అపేక్ష ఉంది. ఇలా ప్రతి ఒక్కటీ సాపేక్షమయినప్పుడేది గానీ ఎలా సిద్ధిస్తుంది. చూడబోతే ఇది చెట్టు ముందావిత్తు ముందా - అనే సామెత క్రిందికి వచ్చింది. అంచేత పరస్పర సాపేక్షమైన ఈ ప్రపంచం సిద్ధించాలంటే నిరపేక్షమైన తత్త్వమొకటి అంతకు ముందే సిద్ధించి ఉండాలి. అలాంటి నిరపేక్ష తత్త్వమే ఈశ్వరుడు. ఈ విధంగా జగత్తుకుండే లక్షణాలను బట్టే తద్విలక్షణమైన ఈశ్వర తత్త్వాన్ని మనం గ్రహించవచ్చు.
పోతే జగత్తు మాదిరే జీవుణ్ణి బట్టి కూడా గ్రహించవచ్చు ఈశ్వర సద్భావాన్ని, జీవుడంటే జ్ఞాన స్వరూపుడేనని గదా పేర్కొన్నాము. అయితే అది పరిమితమైన జ్ఞానం. అపరిమితం కాదు. అపరిమిత జ్ఞానమే ఈశ్వరుడంటే. అది ఈ పరిమిత జ్ఞానంలోనే మన మర్ధం చేసుకోవచ్చు. పరిమితమనేది ఎప్పుడూ పరిపూర్ణమైన భావాన్నే సూచిస్తుంటుంది.
Page 40