ఆయన ప్రచ్ఛన్న బౌద్ధుడు కేవలం శూన్యవాది అని నానావిధాల నిందిస్తున్నారు. శంకరుడెప్పుడూ శూన్యవాదికాడు. ఆ మాటకు వస్తే శూన్యవాదులు బౌద్ధులు. బౌద్ధుల శూన్యవాదాన్ని అదే పనిగా ఖండించారాయన, అలా స్వయంగా ఖండించి ఆయనే మరలా శూన్యవాదాన్ని చేపట్టటమా. అర్ధంలేని మాట. శూన్యవాదమనేది కేవల మసద్వాదం. ఏదీ లేదని చెబుతుందది. పోతే శంకరుల దసద్వాదం కాదది సద్వాదం. అంతా ఉన్నదనే ఆయన సిద్ధాంతం. ప్రపంచమంతా సద్వివర్తమే. సద్వివర్తం గనుకనే ప్రతి ఒక్కదానిలో ఆ సత్తనే దాని స్వరూపమే మరలా మనకు సాక్షాత్కరిస్తున్నది. అణువు మొదలుకొని ఆకాశందాకాఎప్పుడు దేన్ని చూచినా మనం దాన్ని ఉన్నదనే చూస్తాముగాని లేదని చూడము. ఇదే సత్తనే దాని తత్త్వమన్నింటిలోనూ అంతర్లీనంగా ఉందనేందుకు దాఖలా. అసలీ నామరూపాది విశేషాలు కూడా దానికి చెందినవే. అదే. దానినే మనం నామరూపాదులుగా గ్రహిస్తున్నాము. కాబట్టి “ఽ సత్త్వమ్ కస్యచిత్క్వచి దితి బ్రూమః” దేనినీ సృష్టిలో అసత్యమని చెప్పగూడదంటారు శంకరులు.
అయితే ఇక ఆయన అసత్యమనేదేమిటి. అసత్యమనేది ఏదీ లేదు వాస్తవంలో సత్యమైన చైతన్యమే నామరూపాత్మకంగా భాసిస్తే ఆ భాసించే మేరకు దాని నసత్యమన్నాము. ఎందుకంటే అది ఈ చైతన్యం కంటే ఏదో విలక్షణమని నీవు చూస్తున్నావు. చైతన్య విలక్షణమైనదెక్కడ ఉంది సృష్టిలో. లేదనిగదా ముందు ప్రతిపాదించాము. అంచేత అలా లేని దాని నున్నట్టు భావించటమే అసత్యం. ఒక రజతాన్ని మనం శుక్తికగా Oyster చూస్తే అది రజతంగా సత్యమేగాని శుక్తికగా సత్యమని చెప్పలేవుగదా, అలాగే ఒక రూపంలో ఉన్నదాన్ని మరొక రూపంలో చూస్తే అది అసత్యమని చెప్పక తప్పదు. ప్రస్తుతం జీవజగత్తు లిలాంటి అసత్పదార్థాలే. పరిశుద్ధమైన బ్రహ్మచైతన్యాన్నే మన మా రూపంలో దర్శిస్తున్నాము కాబట్టి అసత్యమవి. కాని రహస్యమేమంటే అసత్యమైనా ఇవి సత్యమైన చైతన్యం తాలూకువే కాబట్టి వీటిని పట్టుకొని పోతే మరలా మనలనా చైతన్యం దగ్గరికే అవి తీసుకెళ్ళుతాయి. కనుకనే వీటి రెండింటి మిథ్యాత్వమే మనకా ఈశ్వరుడి సత్యత్వాన్ని సూచిస్తుందని చెప్పటం.
ఈ సూచనకే లక్షణమని పేరు పెట్టారు మన పెద్దలు. లక్ష్యాన్ని మనకు పట్టి ఇచ్చేదేదో అది లక్షణం. లక్ష్యమనేది ఈశ్వర చైతన్యమే. దాని అస్తిత్వాన్ని మనకు చాటి చెబుతాయి.
Page 39