#


Back

   ప్రమాణం లేకుండా ప్రమేయ Object మనేది సిద్ధించదు. ప్రమేయమిక్కడ మిథ్యాత్వం. అది సత్యమైన తత్త్వమొక్కటైనా ఉంటేనే గాని దాన్ని ప్రమాణంగా తీసుకొని మిగతా వాటికి చెప్పటానికి లేదు. అన్నీ మిథ్య అయిన నాడిక దేన్ని పట్టుకొని దేనికి చెప్పాలా మిథ్యాత్వం. చెప్పలేకపోతే అదే సత్యమని ఒప్పుకోవలసి వస్తుంది. కాని జీవ జగత్తులను రెండింటినీ మనం మిథ్య అని ఇంతవరకూ సహేతుకంగా నిరూపణ చేసి కూచున్నాము. ఇక అవి ఏ పరిస్థితిలోనూ సత్యం కావటానికి లేదు. అలాంటప్పుడిక తద్వ్యతిరిక్తమైన ఈశ్వర తత్త్వమొక్కటే సత్యమని ఒప్పుకోక తప్పదు.

   అసలు వీటి మిథ్యాత్వమే దాని సత్యత్వాన్ని మనకు చాటుతుందంటారు శంకరులు. అదేమిటి. మిథ్య అంటే లేదనిగదా చెప్పారు. లేని పదార్ధాన్ని ఎలా సూచిస్తుందని ఆశ్చర్యపడనక్కరలేదు. లేనిదంటే బొత్తిగా లేనిదని గాదు అర్థం. బొత్తిగా లేనిదైతే అసలది మనకంటికే కనిపించేది కాదు. కనిపించే రూపమబద్ధమైనా దాని కాధారమైన దెప్పుడూ సత్యమే, సత్యమైన దాన్ని ఆధారం చేసుకొనే కనిపిస్తుంటుందీ అసత్యం. “నహి మృగ తృష్ణి కాదయోపి నిరాస్పదా భవంతి” ఎండ మావులలాంటివి కూడా నిరాధారం కావంటారు భగవత్పాదులు. దాని కాధారమైన సూర్యరశ్మి అక్కడ ఉండనే ఉంది. అలాగే ప్రస్తుత మీ జీవజగత్తులు మిథ్య అన్నామంటే వీటికాధారమైన ఈశ్వరచైతన్యమెప్పుడూ ఉంది. సత్యమైన ఆ చైతన్యాన్ని వదలకుండానే ఈ రెండూ మనకిలా భాసిస్తున్నాయి. దానికి దూరమైతే అసలివి భాసించనే లేవు. ఇంతకూ రహస్యమేమంటే ప్రతి ఒక్కటీ లోకంలో దానిపాటికది అసత్యమే అయినా దాని అధిష్ఠానం మేరకు మరలా అది సత్యమే. అంటే కార్యదృష్ట్యా మిథ్య- కారణ దృష్ట్యా సత్యమని భావం. అన్నింటికీ కారణమీశ్వర చైతన్యమని గదా ప్రతిపాదించాము. కాబట్టి నామరూపాదికమైన ఈ జగత్తంతా ఆ చైతన్య రూపంగా సత్యం తమ విశేష రూపాలుగా మిథ్యా అని అర్థం చేసుకోవాలి మనం. ఈ ధర్మసూక్ష్మాన్నే ఛాందోగ్య భాష్యంలో ఇలా బయట పెడతారు భగవత్పాదులు. “సర్వంచ నామరూపాది సదాత్మనైవ సత్యమ్ స్వతస్తు అనృతమేవ” నామరూపాదులన్నీ వాటిపాటికవి స్వతహాగా అనృతమే. సందేహంలేదు. కాని వాటినే సద్రూపంగా చూడగలిగితే మరలా అవే సత్యమవుతాయట.

   ఇదుగో ఇదీ మిథ్య అనే మాటకు శంకర భగవత్పాదులిచ్చిన నిర్వచనం. ఈ సూక్ష్మం తెలియక శంకరుడు ప్రపంచాన్ని మిథ్య-మాయ- అని త్రోసిపుచ్చాడు.

Page 38