#


Back

   శరీరమే మిథ్య అయిననాడిక జీవుడు కూడా హుళుక్కే అవుతాడు. ఎంచేతనంటే శరీరమనే ఉపాధి నాధారం చేసుకొనే గదా జీవభావ మేర్పడింది. ఆ ఆధారానికే బ్రతుకు లేకపోతే ఇక ఆధేయానికెక్కడిది. 'నిమిత్త స్యాపాయే నైమిత్తిక స్యాపాయః' అన్నారు శాస్త్రకారులు. నిమిత్త మిక్కడ శరీరం. ఇది ఘటాకాశానికి ఘటంలాగా ఆధారమయి కనిపిస్తున్నది చైతన్యానికి. ఘటమున్నంత వరకే ఘటాకాశమున్నట్టు ఈ సంఘాతమున్నంత వరకే జీవుడనే పేరు. ఆ తరువాత ఘటాకాశమెలా లేదో అలాగే జీవుడనే వాసన కూడా లేదు. ఆ తరువాత అని మాట సామెతకు చెప్పిందే గాని అసలెప్పుడూ లేదీ ఉపాధి. ఒకప్పుడున్నదంటే మరొకప్పుడెలా పోయిందని ప్రశ్న వస్తుంది. ఉన్నదెప్పుడూ తొలగిపోదు. తొలగిపోతే అది ఉన్నదే కాదు. చైతన్యానికి భిన్నంగా జగత్తు లేదని పేర్కొన్నామంటే అది ఎప్పుడో ఒకప్పుడని కాదు. ఎప్పుడూ లేదనే అభిప్రాయం. అంచేత మనకిప్పుడు కనిపిస్తున్నా ఈ శరీరం లేనిదే. అది లేనందువల్లనే దానినంటి పట్టుకొన్న జీవుడు కూడా లేడని సిద్ధాంతం.

ఈశ్వర సద్భావం

   మొత్తం మీద జీవుడూ మిథ్యే జగత్తూ మిథ్యేనని తేల్చుకొన్నాము. దీనితో మిథ్యా విభాగాన్ని గూర్చిన విచారణ సమాప్తమయింది. పోతే ఇక మిగిలింది సత్య విచారణ. సత్యమైన పదార్థమేమిటీ అని ఇప్పుడు ప్రశ్న. పరిశేష న్యాయంగా ఇక సత్యమనేది ఒక ఈశ్వరుడే కావలసి ఉంది. ఏమి కారణం. జీవ జగదీశ్వరులని మూడే మనం మొదట పరిగణించిన పదార్థాలు. ఆ మూడింటిలో జీవ జగత్తులు రెండూ కేవలం మిథ్యాభూత మని తేలిపోయింది. పోగా ఇక శేషించిన పదార్థం ఈశ్వరుడే గదా. కాబట్టి అది ఒక్కటే ఇక సత్యం కావలసి ఉంటుంది.

   అయితే దాని పాటికది కావాలి గాని ఇవి మిథ్య అయితే అది సత్యం కావటమేమిటి. ఏమో వీటి మాదిరి అదికూడా మిథ్యా భూతమే కావచ్చు గదా అని ఆశంక రావచ్చు. అలా కావటానికి వీలు లేదన్నారు శంకరులు. ఎందువల్లనంటే ఆ లెక్కలో మూడూ మిథ్యే కావలసి వస్తుంది. మూటికి మూడూ మిథ్య అయితే ఇక సత్యమైన దేమిటి. సత్యమైన పదార్థమే లేదంటావా అప్పుడివి మిథ్య అని చెప్పటానికి ప్రమాణమే Evidence లేకపోతుంది.

Page 38