ఆకాశం మాదిరే అది శరీరం లోపలా వెలపలా కూడా వ్యాపించి ఉంది. కనుకనే జీవచైతన్యమనీ ఈశ్వర చైతన్యమనీ రెండు లేవు. రెండు ఆకాశాలెలా లేవో రెండు చైతన్యాలు కూడా అలాగే లేవు అయినా ఉన్నట్టు కనిపిస్తున్నదంటే అది కేవల ముపాధి కృతమే గాని వస్తు సిద్ధం కాదు. కాబట్టి ఘటాకాశంలాగా జీవుడనేది కూడా ఒక మిథ్యాభూతమైన తత్త్వమే.
అయితే శరీరాదులైన ఉపాధులున్నంత వరకూ అలా భాసించక తప్పదు గదా అలాంటప్పుడది మిథ్య అని ఎలా భావించటమని మరలా ప్రశ్న వస్తుంది. ఇక్కడే దృష్టాంత దార్ష్టాంతి కాలకున్న తేడా. దృష్టాంతమనేది కొంత వరకే వేదాంతంలో ఆ తరువాత దానికి వీడ్కోలు చెప్పవలసిందే నంటారు స్వామివారు. ప్రస్తుతం ఘటమనీ దర్పణమనీ పేర్కొన్నామంటే అవి వాటిలో ప్రతిఫలించిన ఆకాశాదుల కంటే వేరుగా స్వతంత్రంగా ఉన్న పదార్ధాలు. ఘటమూ ఉంది ఆకాశమూ ఉంది. ఇదీ దృష్టాంతంలో ఉన్న విషయం. పోతే ఇక దార్ష్టాంతిక విషయమలాంటిది కాదు. చైతన్యం కంటే శరీరాదులైన ఉపాధులు వేరుగా లేవసలు. శరీరమంటే అది ఒకటి గాదు. త్వఙ్మాంసాదులూ - ఇంద్రియాలూ - ప్రాణమూ మనస్సూ - ఆఖరు కహంకారమూ-ఈ సంఘాతానికంతటికీ కలిసి శరీరమనిపేరు. దీనినే పిండాండమని కూడా పిలుస్తారు శాస్త్రజ్ఞులు. ఈ పిండాండమనే దెక్కడి దసలు. వెలపల కనిపించే బ్రహ్మాండంలో ఒక భాగమే ఇది. ఆకాశాదికమైన భౌతిక జగత్తుకంతా బ్రహ్మాండమని పేరు. బ్రహ్మాండమంతా ఎలాంటిదని వర్ణించాము మనం. ఈశ్వర చైతన్యానికి భిన్నంగా అది ఎక్కడా లేదు కేవలం మిథ్యాభూతమని గదా నిరూపించాము. బ్రహ్మాండమే వట్టిదని తేలినప్పుడందులో ఏక దేశమైన ఈ సంఘాతం మాత్రం గట్టిదెలా అవుతుంది. ఇదీ దానితో పాటు మిథ్యాభూతమే కావలసి ఉంటుంది. బాహ్య ప్రపంచంలో లాగా దీనిలో కూడా పంచభూతాలే పని చేస్తున్నాయి. మనస్సూ-ప్రాణమూ - కొంత విలక్షణంగా కనిపించినా అవి కూడా భౌతికమే పొమ్మన్నారు శాస్త్రజ్ఞులు. మనస్సన్న వికారమైతే ప్రాణం జల వికారమట. పోతే అహంకారం కూడా భౌతికమేనని వారి తీర్మానం.. అలాంటప్పుడు ప్రపంచం కాని పదార్థమేముంది ఇందులో. లేకుంటే ప్రపంచంతో పాటు ఇది కూడా మిథ్యా కోటిలో చేరవలసిందే గదా.
Page 36